Friday, November 22, 2024

పెద్దాఫీసర్లు ఇండ్లలో పనిమనుషులుగా కానిస్టేబుళ్లు.. ఇది చట్టవిరుద్ధం, కేసు పెట్టాలన్న మద్రాస్​ హైకోర్టు

పెద్దాఫీసర్ల ఇండ్లతోపాటు ఐపీఎస్​ ఆఫీసర్లు కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను పనిమనిషులుగా పెట్టుకోవడాన్ని మద్రాస్​ హైకోర్టు తప్పుపట్టింది. ఇది పోలీసు వ్యవస్థను చెడ్డపేరు తెస్తుందని, కానిస్టేబుళ్లలో బనోబలాన్ని నిరుత్సాహపరుస్తుందని కోర్టు తెలిపింది. ఇంటి పనికి పోలీసు సిబ్బందిని ఉపయోగించడం చట్టవిరుద్ధమని మద్రాస్ హైకోర్టు మంగళవారం పునరుద్ఘాటించింది. ఐపీఎస్‌ అధికారులకు రెసిడెన్షియల్‌ అసిస్టెంట్లను నియమించవచ్చని, అయితే శిక్షణ పొందిన కానిస్టేబుళ్లను ఇంటిపని చేసేందుకు ఆర్డర్‌లీలుగా ఉపయోగించరాదని జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం అన్నారు. యూనిఫాం ధరించిన సిబ్బందిని ఇందుకోసం ఉపయోగించడం చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది.

కానిస్టేబుళ్లను ఆర్డర్లీగా ఉపయోగించుకునే అధికారులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని, అవసరమైతే క్రిమినల్ కేసులో కూడా బుక్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు సుమారు రూ. 45,000 వేతనాలు పొందుతారని, వారిని ఆర్డర్లీలుగా ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని జస్టిస్ సుబ్రమణ్యం అన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోర్టు ఆదేశించింది.

ఈ సమస్యను పరిష్కరించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించినట్లు తమిళనాడు హోంశాఖ కార్యదర్శి కె.ఫణీంద్రారెడ్డి మద్రాసు హైకోర్టుకు తెలిపారు. రిటైర్డ్ పోలీసు అధికారుల నివాసాల్లో నియమించిన ఆర్డర్లీలను కూడా వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు కేసును ఆరు వారాల పాటు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement