Monday, November 25, 2024

MadhyaPradesh: నిజాలు రాస్తే ఇట్లనే ఉంటుందా?.. ముగ్గురు జర్నలిస్టులు జైలుకు!

మీడియా గొంతు నొక్కేసే చర్యలు ప్రారంభమయ్యాయి. సమాజంలోని కుల్లును, ప్రజల బాధలను వార్తగా రాసినందుకు ముగ్గురు జర్నలిస్టులు జైలుపాలయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో ఇవ్వాల (సోమవారం) జరిగింది. ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడిని చెక్క బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనను ఉన్నదున్నట్టు వార్తగా రాశారు కొంతమంది జర్నలిస్టులు. ఆ వార్తా కథనంలో రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలు సరిగా లేవన్న విషయాన్ని హైలైట్​ చేయడంతో అక్కడి అధికారులకు కోపం వచ్చింది. దీంతో వార్త రాసిన జర్నలిస్టులపై పోలీసు కేసు పెట్టారు. నిజా నిజాలు తెలుసుకోకుండా పోలీసులు కూడా ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి వారిని జైలుకు పంపారు.

అక్కడి ఆరోగ్య శాఖ వైద్యాధికారి రాజీవ్ కౌరవ్ చేసిన ఫిర్యాదు మేరకు ఆగస్ట్ 18న భిండ్ పోలీసులు జర్నలిస్టులైన కుంజ్‌బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్‌కె భటేలేలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జర్నలిస్టులపై ఐపీసీ సెక్షన్లు (420), 505 (ప్రజా దుర్మార్గం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దాబోహ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ సోమవారం తెలిపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. అంబులెన్స్ లేకపోవడంతో గాయ ప్రసాద్ (76) కుటుంబం అతన్ని హ్యాండ్‌కార్ట్ పై ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని, బాధితుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుకోలేదని జర్నలిస్టులు ఆగస్టు 15వ తేదీన వార్తను ప్రచురించి ప్రసారం చేశారని తెలిపారు. వార్తలను ప్రచురించి, ప్రసారం చేసిన తర్వాత జిల్లా యంత్రాంగం వార్తా నివేదికపై విచారణ కోసం రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.

కాగా, బాధితుడైన గయా ప్రసాద్ కుమారుడు పురాణ్ సింగ్ అంబులెన్స్​ని పిలవలేదని, అతని తండ్రి, కుటుంబం వృద్ధాప్య పింఛను వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నందున్నందున ఈ వార్త అబద్ధమని కమిటీ గుర్తించిందని ఎఫ్ఐఆర్​లో  పొందుపరిచారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు గయా ప్రసాద్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఒక వార్తా ఛానెల్‌లో పని చేస్తున్న కేసులో బుక్ అయిన ముగ్గురు జర్నలిస్టులలో ఒకరు అనిల్ శర్మపై బెదిరింపులు కూడా వచ్చాయి. గయా ప్రసాద్ కుటుంబానికి ఇస్తున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఆపివేయమని బెదిరిస్తూ జిల్లా యంత్రాంగం ఒత్తిడి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పుడు కారణాలతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని శర్మ పేర్కొన్నారు. అయితే.. దీనిపై వివరణ కోసం ప్రయత్నించగా భింద్ జిల్లా కలెక్టర్ సతీష్ కుమార్ స్పందించలేదు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. జర్నలిస్టులపై తప్పుడు ప్రకటనలు చేసేలా జిల్లా యంత్రాంగం గయా ప్రసాద్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చిందని మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ గోవింద్ సింగ్ ఆరోపించారు. “ఇది మీడియా గొంతును అణిచివేసే చర్య, ఈ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పోరాడుతుంది” అని సింగ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ దూబే కూడా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన చర్యను ఖండించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement