టీఆర్ఎస్ గత ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను అథోగతి పాలు చేశాడని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, డ్రగ్స్ మాఫియా అడ్డగా రాష్ట్రం మారిందన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, అవినీతి, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఫైవ్ స్టార్ హోటల్ వంటి హైటెక్స్ లో ఘనంగా జరుపుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ చూస్తుంటూ కూట్లో రాయి తీయలేని వాడు.. ఏట్లో రాయి తీసునట్లు ఉందని ఎద్దేవా చేశారు. పథకాల పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రాదు ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ జీవితమే మోసంతో ప్రారంభమైందన్నారు. జీవితమంగా దోపిడీ, మోసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చితంమడక నుంచే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోసాలు మొదలయ్యాయని, ఆయనపై ఎన్నికల సమయంలో రూ. 500 దొంగనోట్ల కేసు కేసు బుక్ అయిందని ఆరోపించారు. తెలంగాణకై ఉద్యమించిన తాము పదవులు లెక్కచేయకుండా ప్రజలతో కలిసి ఉద్యమంలొ పాల్గొన్నామన్నారు. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీ తనం ఉండాలంటూ.. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్ లాంటి వారిని పక్కన పెట్టుకుని కేసీఆర్ ప్లీనరీ చేశారని మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులను కేసీఆర్ పొగుడుతున్నారని, తెలంగాణ ఉద్యమకారులు రోడ్డుపై ఉన్నారన్నారు. ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్ కు.. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేసారని.. దేశ రాజకీయాల్లోకి వెళ్తారని నిలదీశారు. ఉద్యమ పార్టీకి రూ.వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? అని అడిగారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వందల కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎలా వచ్చాయని నిలదీశారు. రాష్ట్రానికి అప్పులు… కేసీఆర్ గొప్పలు… జనంకి తిప్పలు అన్నట్టు పరిస్థితి మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మధుయాష్కీ వాఖ్యానించారు. ఇన్ని రోజులు బీజేపీతో అంటకాగిన కేసీఆర్.. ఇప్పుడు విమర్శిస్తే నమ్ముతామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్ బీజేపీ నాటకాలాడుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు 30 సీట్ల కంటే ఎక్కువ రావని.. కేసీఆర్ కు రిపోర్ట్ ఉందన్నారు. ముక్కోణపు పోటీ కోసమే..టీఆర్ఎస్ -బీజేపీని హైప్ చేస్తుందన్నారు. కేసీఆర్ కుట్రపూరితంగా మళ్లీ గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తో పొత్తు అనే ఇండికేషన్ లు ఇస్తున్నారని, అయన బీజేపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ ముల్లు గుచ్చుకుందని అన్నారు. ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఎక్కడో ఉందని ప్రశ్నించారు. 2014 కంటే ముందు వాడిన గులాబీ ముక్కలన్నీ.. నేడు గుబాళిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సభ కోసం సమిష్టిగా మీటింగ్ లు నిర్వహిస్తున్నామని మధుయాష్కీ స్పష్టం చేశారు.