భారత్ శుక్రవారంతో 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటిందని, ఇదే ఆత్మ నిర్భర్ భారత్‌కు నిదర్శనం అని మోడీ అన్నారు. కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతీ ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించామని, సున్నా నుంచి ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు. ఇది దేశం ఘనత అని, దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే 90 శాతానికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారని తెలిపారు. తొలి ఐదు రోజుల్లోనే 15-18 ఏళ్ల టీనేజర్లు కూడా 1.5 కోట్ల మందికి పైగా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని వివరించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో 80 శాతం రెండో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యింది.
ప.బెంగాల్‌కు 11కోట్ల టీకాలు
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌కు దాదాపు 11 కోట్ల డోస్‌లను అందించిందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రానికి 15వేలకు పైగా వెంటిలేటర్లు, తొమ్మిది వేలకు పైగా కొత్త ఆక్సిజన్ సిలిండర్లు కేంద్రం అందించిందని తెలిపారు. వీటితో పాటు 49 పీఎస్‌ఏ కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు కూడా రాష్ట్రంలో పని చేయడం ప్రారంభించాయన్నారు. దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా 17లక్షల మంది క్యాన్సర్ రోగులతో పాటు 2.60 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ది పొందారన్నారు. ప్రధానమంత్రి డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా 12 లక్షల మంది పేదలు ఉచితంగా డయాలసిస్ చేయించుకున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధి నుంచి పేదలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీని కోసం తక్కువ ధరలో మందులు, చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నదని వివరించారు.
తక్కువ ధరకే క్యాన్సర్ మందులు
గత కొన్నేళ్లుగా క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు చాలా తగ్గాయన్నారు. దేశ వ్యాప్తంగా 8వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాలు చాలా సరసమైన ధరలకు మందులు అందిస్తున్నాయన్నారు. ఈ స్టోర్స్‌లో 50కు పైగా క్యాన్సర్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తాయన్నారు. రోగుల అవసరాల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని, 500కు పైగా మందుల ధరల నియంత్రణ వల్ల ఏటా రూ.3000 కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతోందన్నారు. కరోనరీ స్టెంట్‌ల నియంత్రిత ధరల కారణంగా హృద్రోగులు ప్రతీ ఏడాది రూ.4,500 కోట్లకు పైగా ఆదా చేస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital