యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని సర్వ హంగులతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. భక్తులకు ఆధ్యాత్మిక శోభతోపాటు ఆహ్లాదాన్ని పంచే విధంగా చర్యలు తీసుకుంటుంది. ప్రధాన గుట్టతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్లు, టెంపుల్ సిటీ చుట్టూ ఉన్న గుట్టలకు సహజత్వం ఉట్టిపడేలా ‘గ్రీన్ టెర్రామెష్’ విధానంలో కృత్రిమ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఇక యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. కాగా యాదాద్రి పుణ్యక్షేత్రం సమీపంలో నాలుగు నక్షత్రాల లగ్జరీ హోటల్ ఏర్పాటుకానుంది.ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో ఏర్పాటుకానున్న ఈ హోటల్ వచ్చే ఏడాది మార్చి 20న ప్రారంభం కానుంది. అప్పటికి హోటల్ మొదటి దశ పూర్తవుతుందని, 2023 జులై నాటికి మొత్తం 400 గదులతో పూర్తిస్థాయి హోటల్ అందుబాటులోకి రానుంది.
హోటల్లోనే ఇండోర్ స్విమ్మింగ్‌పూల్, ఏసీ బంకెట్ హాల్, ఏసీ జిమ్, స్పా సెంటర్లు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు ఉండనున్నాయి. అదేవిధంగా భక్తులను ఆలయం దగ్గరకు తీసుకెళ్లడానికి ఉచితంగా బస్సును కూడా ఏర్పాటు చేయనున్నారు. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆధునిక వసతులు, హంగులతో లక్ష్మీనివాసం డెవలపర్స్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ సంయుక్తంగా ఈ హోటల్‌ను నిర్మించనున్నాయి. ఆలయానికి సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో దాదాపు 400 గదులతో ఈ హోటల్ నిర్మిస్తామని లక్ష్మీనివాసం డెవలపర్స్ యజమాని రాజేంద్ర ప్రసాద్, ది పార్క్ నేషనల్ హెడ్ వికాస్ అహ్లువాలియా తెలిపారు. ఈ మేరకు హోటల్ ఏర్పాటుకు సంబంధించి రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాల మార్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ హోటలైనా సామాన్యులు, మధ్య తరగతి భక్తులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయని, సుమారు 500 నుంచి 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.