కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోంది. ఆ రాహుల్ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి తట్టుకోలేక నానా రకాల పోస్టులు, ఛీప్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు. అంతేకాకుండా రాహుల్ గాంధీతోపాటు ఆయనతో పాల్గొంటున్న లీడర్లంతా విలాసాల విడిది చేస్తున్నారనే ప్రచారం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ చేస్తున్న విష ప్రచారానికి బిగ్ కౌంటర్ ఇచ్చింది.. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఓ వీడియో సాక్ష్యంతో వివరణ ఇచ్చింది.
ఇవ్వాల 14 కిలో మీటర్ల మేర సాగిన పాదయాత్ర తర్వాత యాత్రలో పాలుపంచుకున్న నేతలు, కార్యకర్తలు ఓ పెద్ద గోడౌన్లా కనిపిస్తున్న బిల్డింగ్‌లో నేల మీదే పరుపులు వేసుకుని పడుకున్నారు. ఈ విడిదిలో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవరికి వారు తమకు ఇచ్చిన పరుపులు పరుచుకుని పడుకున్నారు. భారత్ జోడో యాత్రలో 5 స్టార్ విలాసాలు అంటూ బీజేపీ చేసిన ఆరోపణల విడిది ఇదేనని కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మనీష్ కందూరి తెలిపారు. ఈ మేరకు తను ట్విట్టర్లో ఈ వీడియోని పోస్టు చేశారు.