– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మీరా పనిచేస్తోంది. అదే స్కూల్‌లో కల్పన అనే అమ్మాయి చదువుతోంది. అయితే.. మీరాని చూడగానే తను ప్రేమలో పడిన విషయాన్ని కల్పన గుర్తు చేసుకుంది. అయితే.. ఇక్కడ సమస్య అంతా ఇద్దరూ ఆడాళ్లు కావడమే. కానీ, మీరా కూడా కల్పనతో లవ్‌లో ఉంది. ఇద్దరూ ఒక్కటవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. దీనికి లింగ మార్పిడి ఒక్కటే పరిష్కారం అనుకున్నారు. మూడేళ్ల క్రితం మీరా తన లింగాన్ని మార్చుకుని అబ్బాయిగా మారింది. దీంతో ఇరు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి.
ఇక.. లింగ మార్పిడి గురించి మీరా మాట్లాడుతూ.. తన లింగాన్ని మార్చుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నా అని తెలిపింది. శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకున్నానని, కొంత కష్టమైన పని అయినా ఇబ్బందేమీ లేదని వివరించింది. డిసెంబర్ 2019లో తనకు మొదటి సర్జరీ జరిగిందని ఆరవ్ కుంతల్‌గా మారిన మీరా తెలిపింది. 2019, 2021 మధ్య రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలిపింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆరవ్ (మీరా), కల్పన ఇరువురి కుటుంబాల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు.
ఆరవ్ (మీరా) మాట్లాడుతూ.. “నాకు నలుగురు అక్కలున్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నేను అమ్మాయిగా ఉన్నప్పుడు.. ఒక అబ్బాయి అయితే బాగుండేది అని మా తల్లిదండ్రులు అనుకున్నారు” అని తెలిపింది. ఇక.. లింగ మార్పు తర్వాత ఆరవ్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించాడు. ఇప్పుడంతా బాగానే ఉంది కానీ, పేపర్‌లలో పేర్లు మార్చడం.. స్త్రీ నుండి మగగా మారడం వంటి ప్రక్రియకు సంబంధించిన పేపర్‌వర్క్ లలో చాలా ఇబ్బందులు తలెత్తాయి” అని చెప్పాడు.
కాగా, ఆరవ్ తండ్రి బీరీ సింగ్ మాట్లాడుతూ.. “నాకు ఐదుగురు ఆడపిల్లలున్నారు. కొడుకు లేడు. చిన్నవాడైన మీరా ఆడపిల్ల అయినప్పటికీ అబ్బాయిలా ఉండేది. ఆమె చర్యలన్నీ అబ్బాయి మాదిరిగానే ఉండేవి. అతను అబ్బాయిలతోనే ఆడుకునేవాడు. మీరా తన లింగాన్ని మార్చుకుని మొత్తానికి అబ్బాయిగా మారిపోయాడు. ఆరవ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది”అని తెలిపాడు.