పెట్స్‌కి.. మనుషులతో ఎంతో అనుబంధం ఉంటుంది. వాటిని కాస్త ఆదరంగా చూస్తూ చాలు.. ఇట్టే మనకు కనెక్ట్ అవుతాయి. చాలామంది పెంపుడు జంతువులకు బర్త్‌డే పార్టీలు చేసే వీడియోలు, ఫొటోలు నెట్టింట పెట్టి సంబురపడతారు. వాటిని చూసి అబ్బో అనుకుంటాం. అవే పెంపుడు జంతువులు చనిపోతే వాటికి మనుషుల్లానే అంత్యక్రియలు నిర్వహించి సాగనంపిన ఘటనలూ చదివి ఉంటాం. కానీ, ఈ విషయం మాత్రం కాస్త డిఫరెంట్..
పెంపుడు జంతువుల విషయంలో చాలా మంది అనుసరించే వైఖరి ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాటిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. తాము కన్న పిల్లలను, తమను కన్న తల్లి తండ్రులను దూరంగా ఉంచుకున్నా సరే పెంపుడు జంతువుల విషయంలో మమకారం పెంచుకుని వాటికి సేవలు చేస్తూ ఉంటారు. ఇక తమ తర్వాత అవి ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంలో భాగంగా వాటికి ఆస్తులు కూడా రాసిన ఘటనలున్నాయి. తాజాగా సెర్బియాలో ఒక పిల్లి అనుసరించిన వైఖరి ఆశ్చర్యపరిచింది.
ఎక్కువగా మనుషులు కుక్కలను పెంపుడు జంతువులుగా చూస్తూ ఉంటారు. కాని, పిల్లి విషయంలో మాత్రం అంత ఆసక్తి ఉండదు. కుక్క ఉన్నంత నమ్మకంగా పిల్లి ఉండదని అంటూ ఉంటారు. అయితే ఒక పిల్లి మాత్రం తన యజమాని విషయంలో చూపిన విశ్వాసం ఆశ్చర్యపరిచింది. సెర్బియాకు చెందిన షేక్ ముఅమర్ జుకోర్లీ పెంపుడు పిల్లి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది నవంబర్ లో తన యజమాని ప్రాణాలు కోల్పోయిన తర్వాత రోజు నుంచి ఆ పిల్లి సమాధి దగ్గరే ఉంటోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 6, 2021న యజమాని ప్రాణాలు కోల్పోగా రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసారు. అప్పటి నుంచి ఆ పిల్లి యజమాని సమాధి దగ్గరే ఉంటూ అతని కోసం ఎదురు చూస్తోంది. యజమాని శవం మీద మంచు పేరుకుపోయినా సరే ఆ చలిలో కూడా పిల్లి అక్కడే ఉండిపోయింది. లావాడర్ అనే ట్విట్టర్ యూజర్ చనిపోయిన యజమాని సమాధిపై దిగులుగా కూర్చున్న పెంపుడు పిల్లి ఫోటో ని షేర్ చేసారు. అంత్యక్రియలు జరిగిన రెండు నెలల తర్వాత సమాధి దగ్గర పిల్లి ఉండటం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది.