మళ్లీ లౌడ్ స్పీకర్లు పెట్టడం తగదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించిన కొన్ని నెలల తర్వాత వాటిని మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నారన్నారు. ఇది ఆమోదియోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. లౌడ్ స్పీకర్లు, మైకులకు సంబంధించి ప్రజలను కలవడం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అన్ని స్థాయిల అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను సమీక్షించిన యోగి ఆదిత్యనాథ్, శాంతియుతంగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఇదే సమయంలో మతమార్పిడిలకు సంబంధించిన రిపోర్టులపై అధికారులను హెచ్చరించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా మత మార్పిడిలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కొన్ని నెలల క్రితం.. మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించే అపూర్వమైన ప్రక్రియను మేం పూర్తి చేసాం. పెద్ద ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు స్వయంచాలకంగా లౌడ్ స్పీకర్లను తొలగించారు. ఇది దేశవ్యాప్తంగా ప్రశంసించబడిందని యోగి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఇటీవల కాలంలో మళ్లీ మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు తగవనీ, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.