హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో ఒక విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది.. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్కూటీపై వెళ్తున్న స్టూడెంట్స్‌ని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు లారీ చక్రాల కింద పడిపోయారు. ఇందులో ఒకరి తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గాయపడ్డ మరొకరిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలిని మేఘన (20), గాయపడ్డ విద్యార్థిని సుమనశ్రీ (21)గా గుర్తించారు. ఈ ఇద్దరు దుండిగల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
కాలేజీ ముగిసిన తర్వాత మేఘన, సుమనశ్రీ స్కూటీపై కూకట్‌పల్లి వెళ్తుండగా గండిమైసమ్మ క్రాస్ రోడ్స్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. అక్కడికి రాగానే మేఘన స్కూటీ స్పీడ్ తగ్గించారని.. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వెంగంగా ఢీకొట్టిందని చెప్పారు. కాగా, ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు యాక్సిడెంట్లలో నలుగురు చనిపోయారు.