Tuesday, November 12, 2024

Lok Sabha Elections – ఎగ‌ర‌ని ఎర్ర‌జెండా! వాటిజ్ దిస్ కామ్రేడ్స్

ఎర్ర‌జెండా అంటే పేద‌ల గుండెల్లో ఊపిరి వంటిది.. అడుగ‌డుగునా అండ‌గా ఉంటుంద‌నే భరోసా అందరిలో ఉండేది. కానీ, నానాటికీ ఆ పార్టీ మ‌నుగ‌డ కష్టతరం అవుతోంది. 2004 వరకు బాగానే ఉన్న కామ్రేడ్స్​ హవా ఆ తర్వాత మసకబారుతోంది. ఎన్నిక ఎన్నికకు ఓట్ల శాతం తగ్గిపోతుంటే.. అదేస్థాయిలో పేదల అభిమానం కూడా దెబ్బతింటోంది. ఇక.. ఈ సారి దేశవ్యాప్తంగా కేవలం ఎనిమిది లోక్​సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అదికూడా ఇండియా కూటమి దయతో తమిళనాడు, బీహార్​ వంటి చోట్ల గట్టెక్కింది. ఇదంతా చూసి.. వాటిజ్​ దిస్​ కామ్రేడ్స్, ఇలా అయితే ఎలా అంటున్నారు ఆ పార్టీ అభిమానులు.

ఆంధ్రప్రభ .. స్మార్ట్ బ్యూరో హైదరాబాద్ – ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర త‌గ్గిపోతోంది. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో నాలుగు వామపక్షాలు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. వారి సాంప్రదాయక కంచుకోటలైన కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలో కమ్యూనిస్టు పార్టీల ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌లేదు.

- Advertisement -

పార్టీ చీలిక‌తోనే ప‌త‌నం ప్రారంభం..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ మూడు ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్నిసార్లు మూడో స్థానంలోనూ, కొన్నిసార్లు నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగానూ నిలిచింది. అయితే.. ఇంతలోనే కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడంతో కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. ఈ ధోరణి 2004 వరకు కొనసాగింది.

బెంగాల్ నుంచే క‌ష్ట‌కాలం..

పశ్చిమబెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం పడిపోవడంతో పార్లమెంట్‌లో క‌మ్యూనిస్టుల‌ ప్రాతినిథ్యం తగ్గిపోయింది. అయితే.. కేరళలో ఇప్పటికీ సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం కొనసాగుతోంది. కానీ, అక్కడ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క సీటును సీపీఎం గెలుచుకుంది. అక్కడి సీపీఐ(ఎం) ఓట్ల శాతం 25.82 ఉండగా.. ఆ పార్టీకి 6.14 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 32 శాతం ఓట్లు సాధించినా వామపక్షాలు ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగారు. పశ్చిమబెంగాల్, త్రిపురలో కనీసం ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. ఇక, బెంగాల్‌లో వామపక్షాలకు ఆరు శాతం ఓట్లు రాగా, త్రిపురలో దాదాపు 12 శాతం ఓట్లు పోల్ అయిన‌ట్టు తెలుస్తోంది.

త‌మిళ‌నాడు, బీహార్‌లో ప‌ర్వాలేదు..

తమిళనాడులో సీపీఐ(ఎం), సీపీఐ ఇండియా కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రెండేసి సీట్లలో విజయం సాధించాయి. అలాగే.. రాజస్థాన్‌లో ఒక్క సీటు, బీహార్‌లో సీపీఐ-ఎంఎల్‌ రెండు సీట్లు గెలుచుకోగలిగింది. ఇలా మొత్తం ఎనిమిది సీట్లు వామపక్షాలకు దక్కాయి. అంటే గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. అయితే.. ఈసారి విపక్షాల పనితీరు మెరుగుపడిన తీరుచూస్తే గతంలో పోలిస్తే ఇది చాలా తక్కువ ఉంటుంద‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు అంటున్నారు.

2004లో వామ‌ప‌క్షాల జోరు

2004 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు అద్భుత ప్రదర్శన చేసి యూపీఏ ప్రభుత్వంలో భాగమయ్యాయి. ఆ సమయంలో దేశంలో కాంగ్రెస్, బీజేపీ తర్వాత సీపీఎం మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం) 43 సీట్లు, సీపీఐ 10, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ చెరో మూడు స్థానాల్లో విజయం సాధించాయి. 2004లో యూపీఏ ప్రభుత్వంలో చేరి కాంగ్రెస్‌తో జత కట్టడంతో వామపక్షాలు నష్టపోయాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా 2009లో 24, 2014లో 11, 2019లో కేవలం ఆరుగురికి మాత్రమే సీట్లు గెలిచాయి.

బీజేపీ రాక‌తో కేర‌ళ‌లో గ‌డ్డు ప‌రిస్థితి

కేరళలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పుంజుకోవడంతో వామపక్షాలు న‌ష్ట‌పోతున్న‌ట్టు అన‌లిస్టులు చెబుతున్నారు. కేరళలో హిందువుల ఓట్లను బీజేపీ తనవైపు ఆకర్షిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ఓట్లు బీజేపీ, తృణమూల్‌ వైపు వెళ్లాయి. దాదాపు త్రిపుర పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్లమెంట్‌లో వామపక్ష పార్టీల ఉనికి తగ్గిపోవడంతో కార్మికులు, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాటం బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది.

2004 నుంచి 2024 వరకు వామపక్షాల ఓట్ల శాతం..

2004- 7.85
2009- 7.46
2014- 4.55
2019- 2.46
2024- 2.54

Advertisement

తాజా వార్తలు

Advertisement