ఎన్‌సీపీ సీనియర్ నేత, లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా కేరళ కోర్టు తేలుస్తూ… సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 29వ తేదీన ఫైజల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటును ఎత్తివేసింది లోక్ సభ.