Saturday, November 23, 2024

తెలంగాణలో మరింత కఠినంగా లాక్‌డౌన్

తెలంగాణలో ఈనెల 30 వరకు విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశించారు. లాక్‌డౌన్‌ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేందర్, ఇంటెలిజెంట్స్ విభాగం ఐజీ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరును ప్రతిరోజు జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మే 30 తరవాత తిరిగి లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంట‌ల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉన్నప్పటికీ 8 గంట‌ల‌ తర్వాతే ప్రజలు నిత్యావసరాలకు వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంట‌ల‌ నుంచే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు డీజీపీ సూచించారు.

మరోవైపు లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మిన‌హాయింపు ఇచ్చింది. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో పెట్రోల్ బంకులు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సాగు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ధాన్యం సేక‌ర‌ణ‌, అవ‌స‌రాల కోసం వినియోగించే వాహ‌నాల‌కు మిన‌హాయింపు ఇచ్చారు. హైవేల‌పై పెట్రోల్ బంకుల‌కు ఇప్ప‌టికే మిన‌హాయింపు ఉండ‌గా.. తాజాగా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఉండే బంకుల‌ను కూడా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement