Tuesday, November 19, 2024

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌!

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆ రాష్ట్రం లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక రంగంపై పెను భారం పడకుండా లాక్‌డౌన్‌ అమలు చేయడానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే  అధికారుల్ని ఆదేశించారు. రోజుకి 40 వేల కేసులు దాఖలయ్యే పరిస్థితులు తరుముకొస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

మహారాష్ట్రలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి పూర్తిగా నియంత్ర‌ణ త‌ప్పిపోయింది. రోజులు గ‌డిచేకొద్ది భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్క‌డ‌ రికార్డుస్థాయిలో 40,414 మంది కరోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. మ‌రో 108 ప్రాణాలు కోల్పోయారు. ఫ‌లితం.. మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27.13ల‌క్ష‌ల‌కు చేరింది. ఇక‌ మర­ణాల సంఖ్య 54,181కు పెరిగింది. ఇందులో ముంబైలోనే రికార్డుస్థాయిలో 6,923 కరోనా కేసులు వెలుగుచూశాయి. ముంబైలో ఇప్ప‌టిదాకా సుమారు 4 లక్ష‌ల మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో.. ఇక సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇందుకు సంబంధించిన సంకేతాలిచ్చారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు విధివిధానాలు రూపొందించాల‌ని నిన్న అధికారుల‌ను ఆదేశించారు. నిత్యావసరాలు, అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై క‌స‌ర‌త్తు చేయాల‌ని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా రూట్ మ్యాప్ త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీంతో ముందు నుంచి హెచ్చ‌రిస్తున్న‌ట్టే.. ఏప్రిల్ 2 నుంచి అక్క‌డ లాక్‌డౌన్ త‌ప్పేలా లేదు.

దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ప్రతీ రోజూ 60శాతానికిపైగా మహారాష్ట నుంచే వస్తున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో వారంలో నమోదైన కేసుల పాజిటివ్‌ రేటు అత్యధికంగా ఉంది. జాతీయ పాజిటివిటీ రేటు 5.04గా ఉంటే మహారాష్ట్రలో  ఏకంగా 22.78%గా ఉంది. కేసులు ఉధృతంగా ఉండడంతో ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు  కర్ఫ్యూని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కూడా మ‌హారాష్ట్ర‌వ్యాప్తంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.

గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement