Thursday, November 21, 2024

లాక్ డౌన్ ఆలోచ‌న లేదు – క‌రోనా నిబంధ‌నలు పాటించండి ‘కేజ్రీవాల్’

క‌రోనా కేసుల్లో దేశంలోనే ఢిల్లీ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది. అందుకే రాష్ట్రాల కంటే ముందుగానే ఢిల్లీ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో నిన్న‌టి నుంచి వీకెండ్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తోంది ఢిల్లీ గ‌వ‌ర్నమెంట్. కాగా ఢిల్లీలో క‌రోనా క‌ట్ట‌డి కావ‌డంలేదు. దాంతో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ఢిల్లీలో ఒకే రోజు కోవిడ్ -19 (covid -19) కేసులు 20 వేల మార్కును దాటాయ‌న్నారు. అయినా ప్ర‌స్తుతానికైతే లాక్ డౌన్ ను అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని సీఎం చెప్పారు.

లాక్ డౌన్ వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అన్నారు. ఢిల్లీ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో తాను క‌రోనా నుంచి కోలుకున్నాన‌న్నారు కేజ్రీవాల్. త‌న‌కు తొంద‌ర‌గానే ల‌క్ష‌ణాలు త‌గ్గినా కోవిడ్ ప్రొటోకాల్ ప్ర‌కారం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పారు. లాక్ డౌన్ విధించ‌డం వ‌ల్ల అంద‌రూ ఇబ్బందులు ప‌డ‌తార‌ని అన్నారు. లాక్ డౌన్ విధించ‌డం ప్ర‌భుత్వానికి కూడా ఇష్టం లేద‌ని అన్నారు. అయితే ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే మాత్రం ఈ విష‌యంలో ఆలోచించాల్సి వ‌స్తుంద‌ని సీఎం తెలిపారు. ప్ర‌జ‌లు మాస్క్ ధ‌రించాల‌ని, భౌతిక‌దూరం పాటించాల‌ని కోరారు. ఇవ‌న్నీ చేస్తే ప‌రిస్థితి మారుతుంద‌ని, లాక్ డౌన్ విధించే అవ‌కాశం రాద‌ని చెప్పారు. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్న‌ప్ప‌టికీ గ‌తేడాది కంటే ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement