కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు, అధికారులకు స్పష్టం చేశామని, ఆ మేరకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు.
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. సెకండ్ వేవ్ సమయంలోనూ కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 32 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడి కాగా, 353 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మే 10 నుంచి 24వ తేదీ వరకు తొలుత లాక్ డౌన్ ప్రకటించినా, కేసుల ఉద్ధృతితో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.