Saturday, November 23, 2024

ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా కేసుల అదుపులోకి రావడం లేదు. దీంతో మరోవారం లాక్ డౌన్ ను పొడిగిస్తూ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు. చాలా చిన్న లాక్ డౌన్ విధిస్తున్నట్లు మొదట్లో చెప్పిన ముఖ్యమంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో దానిని పొడిగిస్తూ వెళ్తున్నారు. ఢిల్లీలో లాక్ డౌన్ విధించి ఇది నాలుగో వారం. అయితే లాక్ డౌన్ విధించినప్పటి నుంచి కొవిడ్ కేసులు కొద్దిగా త‌గ్గినయని.. అయితే మ‌ధ్య‌లో వ‌దిలేయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఏప్రిల్‌లో మ‌ధ్య‌లో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడ‌ది 23 శాతానికి వచ్చింది.

ఈసారి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తరం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ దఫ మెట్రో స‌ర్వీసుల‌ను కూడా ర‌ద్దు చేశారు. ఈ నెల 17 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇది కూడా చాలా ఎక్కువే అని, వ్యాప్తిని మ‌రింత అరిక‌ట్టాల్సిందేన‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఢిల్లీలో ఆరోగ్య స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తున్నామ‌ని, ప్ర‌ధానంగా ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తోంద‌ని, అయితే కేంద్ర సాయం వ‌ల్ల ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని కేజ్రీవాల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement