తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఈ నెల10న నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో 2 స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 1,324 ఓట్లకు గాను.. ఇక్కడ 1,320 ఓట్లు పోలైయ్యాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్ సాధించే ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చేపట్టారు. ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వంటేరి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మల, స్వతంత్య్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల్లో 1,026 ఓట్లకు గాను 1,018 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను నాలుగు టేబుళ్లపై లెక్కించనున్నారు. 12 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున కేటాయించారు.
ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పట్టణంలోని డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. లెక్కింపు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ నుంచి తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి పోటీ పడుతున్నారు. మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. ఇందుకోసం నాలుగు టేబులను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. ప్రతి టేబుల్ పై 200 ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ దాటితే అభ్యర్థి విజయం ఖరారు చేస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు టీటీడీసీ సెంటర్ లో జరుగుతోంది. ఇందుకోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 200 ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం అదనంగా ఐదవ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ తరుపున దండె విఠల్, స్వతంత్ర్య అభ్యర్థిగా పెందూరి పుష్పరాణి బరిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 937 ఓట్లకు గాను 860 ఓట్లు పోలయ్యాయి.
నల్లగొండలోని మహిళా శక్తి భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు టేబుల్లో లెక్కింపు చేపట్టగా.. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రతి టేబుల్ పై 200 ఓట్లను లెక్కించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ బరిలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1,271 ఓట్లకు గానూ 1233 పోలయ్యాయి.