కరోనా వల్ల ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఉపాధి కోల్పొయిన సంగతి తెలిసిందే. దాంతో లోన్ లు తీసుకునేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని ఓ కుటుంబం తీసుకున్న లోన్ ని కట్టలేకపోయింది. దాంతో నిర్థాక్ష్యణ్యంగా వారు ఉంటోన్న ఇంటికి సీల్ వేశారు అధికారులు. దాంతో లోన్ కట్టని కుటుంబాన్ని పిల్లా, పాపలతో సహా కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టారు. కాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి సహకార బ్యాంకు 2017-18లో జేఎల్‌జీ గ్రూపునకు రుణాలు మంజూరు చేసింది. గ్రూపు సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 20వేల రూపాయల చొప్పున రుణమిచ్చారు బ్యాంకు అధికారులు. మండలంలోని సుద్దేపల్లి, రామచంద్రాపురం, కోరుట్లగూడెం, బోదులబండకు చెందిన పలు గ్రూపులకు చెందినవారు బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఒక్కో సభ్యుడు 20 వేలకు మించకుండా రుణం తీసుకున్నారు.
రుణం మంజూరుకు అధికారులు కమీషన్లు ముట్టనిదే రుణాలివ్వరు. అలాంటిది రుణం సకాలంలో చెల్లించక పోవడంతో రుణ గ్రహీతలపై ప్రతాపం చూపించారు.లోన్ కడుతారా చస్తారా అంటూ హుకుం జారీ చేశారు. పేదరికంతో మగ్గుతున్న వారు అప్పటికప్పుడు డబ్బు కట్టలేకపోయారు. రంగంలోకి దిగిన అధికారులు ఇళ్లకు సీల్ వేశారు. పిల్లాపాపలను చూసి కూడా కరుణ చూపలేదు. దయాదాక్షిణ్యం లేకుండా రోడ్డుమీద నిలబెట్టారు. కాస్త టైమివ్వండి.. లోన్ చెల్లిస్తామని బతిమిలాడినా కనికరించలేదు. పిల్లలను చూసైనా వదిలేయండని సారూ అని కాళ్లావేళ్ల పడ్డా వదల్లేదు. ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటకు పంపి ఇళ్లను జప్తు చేశారు. ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో రోడ్డుమీదే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కోట్లలో అప్పు తీసుకున్నోళ్లను వదిలి.. పేదోళ్లపై ప్రతాపం చూపుతున్నారంటూ బ్యాంకు అధికారులపై భగ్గుమంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఇళ్ల ఎదుటే పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..