లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. తీసుకున్న అప్పు తీర్చలేదని యాప్ నిర్వాహకులు విషయాన్ని యువకుని బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసి ఇజ్జత్ తీస్తున్నారని… దాంతో మనస్తాపం చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన మేడ్చల్ మాల్కజ్ గిరి జిల్లా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన సింగటి రమేష్ (24) 8 నెలలుగా ఉప్పల్‌లోని విజయపురికాలనీలో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. ఆన్‌లైన్‌లో గణితం బోధిస్తున్నాడు. అయితే తన అవసరానికి ఆన్‌లైన్‌లో ఓ యాప్ ద్వారా రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. కానీ సకాలంలో ఆ అప్పును రమేష్ తీర్చలేకపోయాడు. దాంతో సదరు యాప్ నిర్వాహకులు యువకుని తాలూకు బంధుమిత్రుల ఫోన్లకు అప్పు విషయాన్ని పంపించారు.
ఈ విషయం తెలిసిన యువకుడు అది అవమానంగా భావించి శుక్రవారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వచ్చిన మిత్రులు ఇంటి లోపల నుంచి గడియ పెట్టి ఉండటాన్ని గమనించి, దాన్ని తొలగించి చూడగా రమేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. వెంటనే రమేష్ తండ్రి సుధాకర్‌కు, సోదరుడు హరీశ్, ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బంధుమిత్రుల నుంచి వివరాలు సేకరించారు. యువకునికి ఆన్‌లైన్ అప్పు తప్ప ఇతర ఏ విధమైన ఇబ్బందులు లేవని వారు పోలీసులకు వివరించారు. పోలీసులు కేసు నమదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.