హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఆచార్య ఎన్.గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు స్వర్ణ కంకణాన్ని బహూకరించారు. హైదరాబాద్ ఆబిడ్స్ తెలంగాణ సారస్వత పరిషత్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాహిత్య సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొదటిసారిగా భారత జాగృతి తరపున ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహిత్య పురస్కారం అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సాహిత్య జాగృతి పురస్కారం దేశవ్యాప్తంగా ఇస్తామన్నారు.
వేమన పద్యాలు అందరికి అర్థమయ్యేలా వేమనను మళ్లీ తెలుగు వారికి పరిచయం చేసినందుకు ఆచార్య ఎన్.గోపికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని చెప్పారు. వృద్ధుల గురించి వృద్ధోనిపషథ్ బుక్ రాసారు.. అది నాకు బాగా నచ్చిందన్నారు. జలగీతం పుస్తకాన్ని అద్భుతంగా రాసారు.. అవార్డు ఇస్తున్నామని అడగ్గానే అంగీకరించినందుకు గోపి సార్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
అవార్డు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే తొలి అవార్డును ఆచార్య ఎన్.గోపి అందుకోనుండడం విశేషం. గోపి ఇప్పటికీ 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాదాలు కాగా, మిగతావి ఇతరాలు ఉన్నాయి. వారి రచనలు అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అవడంతో పాటు జర్మన్, పర్షియన్, రష్యన్ వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. వీరు తెలుగు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరించడంతో పాటు కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీ గా చేశారు.