Tuesday, November 19, 2024

తెలంగాణలో కొలువుల జాతర!

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 55వేలకు పైగా కొలువులు భర్తీ చేయనున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఏప్రిల్ మూడోవారంలో మొదటి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం(మార్చి 28) సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.

గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదువేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సేకరించారు. అయితే నోటిఫికేషన్లు ఎప్పుడో రావాల్సి ఉంది కానీ ఎన్నికల నియమావళి వల్ల వాయిదా పడుతున్నాయి. గత నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement