Tuesday, November 26, 2024

Liquor Scam | లిక్కర్​ స్కామ్​ అంతా ఫేక్​.. సీబీఐ 56 ప్రశ్నలు అడిగిందన్న కేజ్రీవాల్​

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ ఇవ్వాల (ఆదివారం) విచారణకు పిలిచింది. దాదాపు తొమ్మిది గంటల పాటు కేజ్రీవాల్​ని ప్రశ్నించింది. లిక్కర్‌ లాబీకి లబ్ధి చేకూర్చేలా పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అధికారులు సాక్షిగా ప్రశ్నించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆయనను మళ్లీ సీబీఐ విచారణకు పిలువలేదు. విచారణ అనంతరం నివాసానికి చేరుకున్న అనంతరం కేజ్రీవాల్​ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీబీఐ తనను మొత్తం 56 ప్రశ్నలు అడిగిందని, ఈ కేసు అంతా ఫేక్​ అని తెలిపారు.

మద్యం పాలసీ అమలులోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి తనను ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ పిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చిస్తానన్నారు. అయితే.. మద్యం కుంభకోణంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. మద్యం పాలసీ కేసు అబద్ధం, కల్పితమన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజాయితీగల జాతీయ పార్టీ అని, ఆప్‌ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నిజాయితీ తమ సిద్ధాంతమన్న ఆయన.. తాము చేస్తున్న మంచి, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పరువు తీసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిని సీబీఐ విచారిస్తున్న సమయంలో అరెస్టు చేయవచ్చే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ పార్టీ సీనియర్​ నేతలు భేటీ అయ్యారు. విచారణను నిరసిస్తూ సెంట్రల్‌ ఢిల్లీలోని లోధి రోడ్డు సమీపంలో సీబీఐ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఎంపీలు రాఘవ్‌ చద్దా, సంజయ్‌ సింగ్‌ సహా ఆప్‌ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే వారికి విముక్తి లభించింది. బీజేపీ కేజ్రీవాల్ ఫోబియాతో బాధపడుతోంది. కేజ్రీవాల్ భయం కారణంగానే బీజేపీ ఇలాంటి చర్యకు దిగింది. ఇది పిరికిపంద చర్య. మాకు జైలు భయం లేదు’ అంటూ రాఘవ్‌ చద్దా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement