మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రంగుల పండుగ హోలీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
హోలీ పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మూసి ఉంటాయని కమిషనర్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.