బెంగళూరు – ఇప్పటికే కర్నాటక ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు సౌకర్యంతో ఎంజాయ్ చేసున్న మహిళలకు ఇప్పడు తాజాగా మద్యం కూడా ఉచితంగా లభించనుంది.. అయితే ఇది ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ కాదు… అక్కడ ఉన్న పబ్ యాజమాన్యాలు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉచిత మద్యం ప్రకటన చేశారు.. వివరాలలోకి వెళితే బెంగుళూరులో అత్యధిక పబ్‌లు కల్గిన కోరమంగల, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, ఎంజీ రోడ్డు, ఇందిరానగర్, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లోని పబ్‌లలో రోజూ పార్టీలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతంలోనే ఏకంగా 150కి పైగా పబ్ లు ఉన్నాయి.. వారాంతంలో మూడు రోజులు పార్టీలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే గత నెలరోజులుగా పబ్ లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది..కనీసం నిర్వహణ ఖర్చులు రాక లబోదిబో మంటున్నారు..
దీంతో ఉచితానికి తెరతీశారు.. మహిళలకు ఉచితంగా మద్యం ప్రకటిస్తే యువత ఎక్కువమంది పబ్‌లకు వస్తారనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదన పెట్టినట్లు కోరమంగలకు చెందిన ఓ పబ్ మేనేజర్ రాబర్ట్ తెలిపారు. పురుషులు ఎక్కువ సంఖ్యలో పబ్‌లకు రావాలంటే మహిళలు ఉండాల్సిందేనని అన్నారు. మహిళలకు ఉచితంగా మద్యం ఇవ్వడం ఇదే కొత్త కాదని, కొందరు ప్రకటించుకుని ప్రచారం చేయడంతోనే వెలుగులోకి వచ్చిందని ఇందిరానగర్ పబ్ ఉద్యోగి ఒకరు తెలిపారు. సాధారణంగా సోమవారం నుంచి గురువారం దాకా పబ్‌లకు వచ్చేవారు అంతంతమాత్రంగానే ఉంటారు. ఈ ఉచిత ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ పబ్ లు కిటకిటలాడుతున్నాయి.. వచ్చే వారు సీటు కోసం రెండు గంటల మించి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిదంటున్నారు.. మొత్తానికి ఉచితం బాగానే వర్కౌట్ అయినట్లు ఉంది..