మాజీ సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులపై మరో కేసు నమోదు కానుంది. బొంబాయి బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్టు నవనీత్ దంపతులపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఇవ్వాల (బుధవారం) కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నవనీత్ కౌర్ దంపతులపై కొత్త కేసు నమోదు చేసేందుకు ముంబై పోలీసులు రెడీ అయ్యారు. దావూద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత యూసుఫ్ లక్డావాలాను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ లక్డావాలా నుంచి నవనీత్ దంపతులు రూ.80 లక్షలను అక్రమంగా వసూలు చేశారన్నది సంజయ్ రౌత్ ఆరోపణ. ఈ ఆరోపణలతోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన నవనీత్ దంపతులు.. తాజా కేసు నమోదైతే మరింత ఇబ్బందులకు గురి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.