Saturday, November 23, 2024

Big Story: గోదావరి-కావేరీ నదుల అనుసంధానం.. తెలంగాణ‌కు ద‌క్క‌ని ప్ర‌యోజ‌నాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గోదావరి- కావేరి నదుల అనుసంధాంతో తెలంగాణ జలప్రయోజనాలకు విఘాతం కలుగుతుందా?, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులకు నీటి సమస్య వస్తుందా? అనే సందేహాలకు సాగునీటి పారుదల నిపుణులు ఔను.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి-కావేరీ అనుసంధానాన్ని సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఖరారు చేసింది. ఇచ్చంపల్లి వద్ద గోదావరినదీపై బ్యారేజీ నిర్మించి తమిళనాడులోని కావేరి నదీపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. సుమారు రూ.85.962 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ అనుసంధాన ప్రాజక్టు ద్వారా రోజుకు 2.2టీఎంసీల నీటిని తరలించేందుకు పక్కాప్రణాళిక రూపొందించారు.

అయితే తెలంగాణ నుంచి గోదావరి నీరు తరలించేందుకు రూపొందించిన ప్రణాళికతో సుమారు అరవైవేల ఎకరాల భూమి కోల్పోయే పరిస్థితి ఉందే కానీ, సమగ్ర జలప్రయోజనం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 4. 53 లక్షల హెక్టార్లు కొత్త ఆయకట్టు వస్తుందని నివేదికలో పేర్కొన్నారు. అయితే వేలాది ఎకరాల భూమి కోల్పోతున్న తెలంగాణకు రెండు లక్షల లోపు ఎకరాలకే నీటి ప్రయోజనం ఉంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్త్తి అయితే సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు తెలంగాణకు ఉన్నప్పుడు రెండు లక్షల ఎకరాల సాగునీటి కోసం రోజుకు 2.2 టీఎంసీ నీటిని కోల్పోవల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు.

సాధ్యం కానీ ఇచ్చంపల్లి ప్రతిపాదనలు
రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం ఇచ్చంపల్లి దగ్గర గోదావరి నదీపై బ్యారేజీ నిర్మాణం చేసి గోదావరి నీటిని కావేరీ నదీకి తరలించాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 15.85 టీఎంసీలు. ఈ బ్యారేజ్‌ ప్రభావం కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌, మేడిగడ్డ పై ఉండదని సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో చేసిన నివేదికలో ఉన్నప్పటికీ క‌చ్చితంగా ప్రభావం ఉంటుందని ఇంజనీర్లు వాదిస్తున్నారు. ఇచ్చంపల్లి బ్యారేజ్‌ నుంచి రోజుకు 2.2 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్‌కు మళ్లిస్తారు. మార్గ మధ్యంలో గొట్టిముక్కల బ్రాంచికాలువ కింద నల్గొండ జిల్లాలోని మునుగోడుకు సాగునీరు అందుతుందని డీపిీఆర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే ఎస్‌ఆర్‌ఎస్పీ రెండవదశ కిందా లక్షా 78 వేల హెక్టార్లకు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ కింద లక్షా 9వేల హెక్టార్లకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఎంఆర్‌, డిండి, తదితర ప్రాజెక్టులతో పాటుగా చెక్‌ డ్యాంల నిర్మాణాలు చేపట్టి సుమారు 15 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వచ్చేందుకు పనుల్లో వేగం పెంచింది. తెలంగాణ కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపడుతున్న ఈ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల సహాయం కానీ, నికర జలాల కేటాయింపులు కానీ చేయకుండా రోజుకు 2.2 టీఎంసీల నీటిని కావేరికి తరలించుకుపోవడం ఎంతవరకు న్యాయమని సాగునీటి వనరుల నిపుణులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కేంద్రం నుంచి కరువయ్యాయి.

ఈ నీటితో నాగార్జున సాగర్‌ కుడిగట్టు (ఆంధ్ర)కు రెండు లక్షల 26వేల ఎకరాలకు, సోమశిల కింద సుమారు 2లక్షల ఎకరాలకు నీరు అందడంతో పాటుగా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అలాగే కావేరి కింద 78.250 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకణ జరగనుంది. గోదావరి కావేరి నదుల అనుసంధానం తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటికీ తెలంగాణ ప్రయోజనాలకంటే ఆంధ్రకు జలప్రయోజనాలు కలుగనున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక నీటిపంపకాలపై దృష్టి సారిస్తే గోదావరి అనుసంధానంతో తెలంగాణకు 65.8 టీఎంసీల ప్రయోజనం ఉంటే ఆంధ్రకు 79.92 టీఎంసీలు, తమిళనాడుకు 84.28 టీఎంసీల ప్రయోజనం ఉంది.

తెలంగాణ నుంచి నీటిని కావేరికి అనుసంధానం చేస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ నీటి ప్రయోజనాలే అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరీ గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటిని తరలించాలంటే నిర్మించే సొరంగమార్గాలు, కాలువలు, ఆనకట్టలకు తెలంగాణలో సుమారు 60వేల ఎకరాలు కోల్పోవల్సి వస్తుంది. మార్గ మధ్యలో తెలంగాణ ప్రాంతంలోని 10గ్రామాలు, 5,475 కుటుంబాలు, 2లక్షల ఆరువేల మంది నిరాశ్రయులు కావల్సి ఉంటుంది. భూములు కోల్పోవడంతో పాటు పలుగ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గోదావరి- కావేరీ నదుల అనుసంధానం తెలంగాణ నుంచి అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది.

మహానదీ నుంచి కావేరి అనుసంధానానికి అభ్యంతరం లేదు
తొలుత ప్రకటించినట్టు మహానదీ నుంచి గోదావరి అనుసంధానం పట్ల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్కడ నిర్ణయాలుంటాయని నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించే అవకాశాలు లేవనీ, కాళేశ్వరం ముంపు ప్రాంతాల నీటికి విఘాతం ఏర్పడుతుందని మాజీ ఈఎన్సీ, విశ్రాంత ఇంజనీర్ల రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యాంప్రసాద్‌ రెడ్డి చెప్పారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ వరకు 300 కిలోమీటర్లు తెలంగాణ భూభాగం నుంచి ప్రవహించి కలుస్తుంటే తెలంగాణ వాటాపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ఆయన సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌లో కలిస్తే, అవి కృష్ణా నీరు అవుతుంది. అలాంటప్పుడు కృష్ణానది నీటి వాటాలు తేల్చి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement