కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి స్పుత్నిక్ వి రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించింది. టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది. ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. స్పుత్నిక్ మూడో టీకా కానుంది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పుత్నిక్ వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ టీకాపై మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ క్లినికల్ పరీక్షలు నిర్వహించింది. భారత్లో సంవత్సరానికి 85 కోట్లకుపైగా టీకా డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులకు డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన 24 గంటల్లోపే డీసీజీఐ ‘స్పుత్నిక్-వి’ టీకా అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.
స్పుత్నిక్ వి టీకా సామర్థ్యం 91.6 శాతంగా ఉంది. స్పుత్నిక్ వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన 60వ దేశంగా భారత్ నిలిచినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) పేర్కొంది. తొలి విడత డోసులను ఏప్రిల్ నెలాఖరున లేదా మేలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు.