ఎయిర్ ఫోర్స్‌కు తేలికపాటి యుద్ధ విమానాలను (ఎల్‌సీఏ) ఈ జూన్ నెలలో అందించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్‌సీఏ తేజస్‌ని 2003 నుంచి వినియోగిస్తోంది ఇండియా.
73 లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తరగతికి చెందిన తేజస్ ఎంకే – 1ఏ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 10 ఎంకే – 1 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఎంకే1 రకంతో పోలిస్తే ఎంకే – 1ఏలో 40 మార్పులున్నాయి. ఎల్‌సీఏను ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రూపొందించింది. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కింద పనిచేస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో తొలి ఎల్‌సీఏ స్క్వాడ్రన్ ఫ్లైయింగ్ డాగర్స్‌ను 2016లో ఏర్పాటు చేశారు. రెండో స్క్వాడ్రన్ ఫ్లైయింగ్ బుల్లెట్స్‌ను 2020లో ఏర్పాటు చేశారు.
ఎల్‌సీఏ భావన 1984లో మొదలైంది. ఎల్‌సీఏలు తేలికైనవి, చిన్నవి, తోక లేనివి. సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తరగతికి చెందినవి. ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి ఉపయోగించే ఆయుధాలను తీసుకెళ్లడానికి వీటిని రూపొందించారు. దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్‌సీఏ తేజస్. ఒకే ఇంజిన్ కలిగిన ఈ ఎల్‌సీఏను 2003లో అందుబాటులోకి తెచ్చారు.