లాన్సెట్ జర్నల్ అధ్యయనం లో వెల్లడి
పురుషులలో ఐదేళ్లు, మహిళలలో నాలుగేళ్లు పెరుగుదల
భారత్ లో పురుషుల సగటు ఆయుష్షు 75 ఏళ్లు
మహిళల సగటు 80 ఏళ్లు
2050 నాటికి మరింతగా పెరిగే అవకాశం
‘‘నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు జీవించు నాయన..’’ అనే మాట మనం తరచూ వింటుంటాం. ఇప్పుడు ఇలాంటి ఆశీస్సులేవి అవసరం లేదు. ప్రస్తుతం మనుషుల జీవించే రోజులు పెరిగినట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పురుషుల వయసు 5 సంవత్సరాలు, మహిళల వయసు 4 ఏళ్లు పెరుగుతున్నట్టు తెలిపింది. 2022-2050 మధ్య కాలంలో ఈ మార్పు కనిపిస్తోందని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. అంతేకాదు విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు ఆయుర్దాయం తక్కువగా ఉన్నాయని భయపడుతున్న దేశాల్లో ఈ పెంపుదల నమోదవుతున్నట్టు తెలిపింది. ఇది ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్టు అధ్యయనం చెప్పడం గమనార్హం.
కరోనా అనంతరం..
కరోనా అనంతరం.. ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన ఔషధాల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. ఇలా రోగనిరోధక శక్తి పెరగడంతో ఆ ప్రభావం ఆయుర్దాయంపైనా పడినట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల మానవ జీవన కాలం పెరుగుతోందని అంచనా వేశారు. దీంతో పాటు ఆయుర్దాయ అసమానతలు కూడా తగ్గుతున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ డైరెక్టర్ క్రిస్ ముర్రే పేర్కొన్నారు.
కీలక విషయాలు ఇవీ..
- ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా జీవించే వారి ఆయుర్దాయం 2.6 సంవత్సరాలు పెరుగుతోంది.
- 2022లో 64.8 ఏళ్లు ఉండగా 2050లో 67.4 సంవత్సరాలకు చేరనుంది.
- 2050 నాటికి భారత్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 75 ఏళ్లుగా ఉండనుంది.
- మహిళల ఆయుర్దాయం 80 ఏళ్లకు చేరనుంది.