టీఆర్ ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని రాజీనామా లేఖలో గుర్తు చేసిన రవీందర్ సింగ్. ఉద్యమకారులను పక్కన పెట్టి.. పార్టీలో చేరిందే తడవుగా పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని మండిపడ్డారు ఆయన. లేఖలో ఏం రాశారంటే..
ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చాం. ఉద్యమ ద్రోహులకు అందలమెక్కిస్తూ.. ఉద్యమకారులకు అవమానాలు చేస్తుంటే బాదేస్తోంది.
కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలన్నీ మీకు చెబుతామంటే కనీసం సమయం కూడా ఇవ్వడం లేదు. కరీంనగర్ జిల్లాలో పార్టీని భ్రష్టు పటిస్తూ, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మీరు పట్టించుకోవడం లేదు.
అధికారం రాకముందు మీరు ఉద్యమకారులను ఎలా గౌరవించేవారో.. అధికారం వచ్చాక వారి పరిస్థితి ఏమిటో ఓసారి గుర్తు చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇంతవరకు ఆదరించిన మీకు ధన్యవాదలు అంటూ లేఖ ముగించారు రవీందర్ సింగ్.