‘‘కుమ్రం భీమ్ పేరు వినగానే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.. డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. బీజేపీ సర్కారు వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. తెలంగాణకు డబులింజన్ సర్కారు ఎంతో అవసరం. డబులింజన్ సర్కారు ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయో ఉంటారు. గిరిజన యూనివర్సిటీకి 10 ఏండ్లుగా కేసీఆర్ సర్కారు స్థలం ఇవ్వలేదు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు కూడా ఏర్పాటు కాబోతోంది. కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది మోదీయే’’ అని అమిత్‌షా అన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33శాతం వాటా..
‘‘చట్టసభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను మోదీ తీసుకొచ్చారు. 10 ఏండ్లలో పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు. కేటీఆర్‌ను సీఎం ఎలా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచించారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమే పనిచేశారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం. ఎన్నికలు రాగానే కొత్త దుస్తులు వేసుకుని కాంగ్రెస్ నేతలు వస్తారు. పేదల గురించి మాట్లాడడం తప్ప వాళ్లకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదు. గిరిజనులకు ఎన్నో హామీలిచ్చారు. అందులో ఒక్కటీ కూడా అమలు చేయలేదు”అని అమిత్‌షా ధ్వజమెత్తారు.