హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండుగ కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాదర్శి, మిషన్ భగీరథ సెక్రటరీ స్మితాసబర్వాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మిషన్ భగీరథ ఇంజనీర్లు, అధికారులతో ఆమె సమావేశమై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్షించారు. మిషన్ భగీరథ ప్రధాన కార్యదయంలో చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్‌ఈలతో జరిగిన సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 18నాడు మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలను నిర్వహించాలన్నారు. నాడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలను, నేడు మిషన్ భగీరథతో అవుతున్న తాగునీటి సరఫరాను గ్రామస్థులకు వివరించాలన్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, మీడియా ప్రతినిధులను వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వద్దకు తీసికెళ్లాలన్నారు. సంబరాల్లో గ్రామస్తులంతా పాల్గొనేలా చూడాలన్నారు.