Tuesday, November 26, 2024

Strategy | అసెంబ్లీ వ్యూహమేంటి, ఏఏ అంశాలు చర్చిద్దాం.. కేంద్రంతోపాటు, గవర్నర్ వ్యవహారంపైనా కేసీఆర్‌ సమాలోచనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అసంపూర్తిగా ఆగిపోయిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పూర్తి దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల ఏడాది కావడంతో పాలనలో వేగం పెంచే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలు, అవసరాల దిశగా దృష్టి కేంద్రీకరించారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, ప్రజల డిమాండ్లను తెలుసుకుంటున్నారని సమాచారం. ఇందుకు ప్రజా ప్రతినిధులు మొదలుకొని అధికారులతో వివిధ రూపాల్లో సమాచార సేకరణ చేస్తున్న ఆయన డిసెంబర్‌లో వారం రోజులపాటు నిర్వహించాలని భావిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకు ఈ నెల మొదటి వారంలో అధికారులతో విస్తృత స్థాయి సమావేశం జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్‌ 13తో సీఎం కేసీఆర్‌ రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవనున్న నేపథ్యంలో కీలక సంస్కరణల దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ధరణి, పోడు భూముల సమస్యలు, సొంత ఇంటి జాగ ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రైతుబంధు, పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ, కొత్త పింఛన్లు, ఇతర నూతన పథకాలపై అధికారులతో చర్చించనున్నట్లుగా సమాచారం. అదేవిధంగా రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆంక్షలను ఎండగట్టేలా సమావేశాల నిర్వహణకు కీలక అజెండాను ప్రభుత్వం రూపొందించుకుంటోంది. ఆయా అంశాలపై శాఖల వారీగా వివరాలపై అధికారులతో చర్చించి సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారని సమాచారం. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోకపోవడంతో జరిగిన ఆర్థిక నష్టంతోపాటు, గ్రాంట్లు, రాష్ట్ర హక్కుగా రావాల్సిన నిధుల చెల్లింపుల్లో జాప్యంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయపోరాటం దిశగా చర్చించనున్నట్లు తెలిసింది.

శాసనసభా ప్రత్యేక సమావేశంలో పలు తీర్మానాలు చేయాలని భావిస్తున్న సర్కార్‌ ఇందుకు వీలుగా అధికారుల నుంచి శాఖల వారీగా సమాచార సేకరణ చేయనున్నది. సెస్‌ల పేరుతో పన్నుల వాటాను 41శాతం నుంచి 29శాతానికి కుదించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1350 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సూచించిన స్థానిక సంస్థలకు రూ.315 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502 కోట్లు పన్నుల పరిహారం రూ.723 కోట్లు పెండింగ్‌లో పెట్టడం పట్ల తీర్మానం చేయనున్నారు. కేంద్రానికి తీర్మానం పంపిన తర్వాత న్యాయపోరాటం దిశగా యోచిస్తోంది. ఇక ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టిన గవర్నర్‌ తీరుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.

- Advertisement -

ఎనిమిది బిల్లులను గత సమావేశాల్లో ఆమోదించి పంపినా వాటిలో ఏడు బిల్లులను ఇంకా గవర్నర్‌ ఆమోదించకుండానే పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 200లో ఉన్న యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌ అనే పదాన్ని తొలగించి 30 రోజుల గడువును విధిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ ప్రభుత్వం మరో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా అన్ని అంశాలపై చర్చించేందుకు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, డిమాండ్లను ఆకళింపు చేసుకునే దిశలో డిసెంబర్‌ మొదటి వారంలో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement