హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ధాన్యం ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లి రైతులు పండించిన మొత్తం వరిని కొనుగోలు చేసేదాకా విశ్రమించరాదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ చెంతకు తీసుకువెళ్లాలన్న యోచనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉన్నట్టు తెలుస్తోంది. ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ప్రధానిని కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరాలని కేసీఆర్ రాష్ట్రానికి చెందిన ఎంపీలను కోరినట్టు సమాచారం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ముడి బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తెగేసి చెప్పడంతో ఇక ఈ అంశాన్ని ప్రధాని వద్దే తేల్చుకోవాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ నుంచి ఏటా గోధుమలు, ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ముడి బియ్యమే కావాలని పట్టుబట్టడం బట్టి చూస్తుంటే రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఏదో మెలిక పెట్టి తద్వారా ధాన్యాన్ని సేకరించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని తెరాస అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చర్చనీయాంశం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
నూకల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి
తెలంగాణ ప్రజలకు నూకల అన్నం తినే అలవాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో పడుతున్న తెరాస ఈ అంశాన్ని ఊరు వాడల్లో ప్రచారం నిర్వహించి భాజపాను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని భేషరతుగా సేకరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు సమావేశమైన ఏకగ్రీవ తీర్మానం చేసి పంపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ సమావేశమైన సందర్భంలో ఢిల్లిdలో కేంద్ర మంత్రి గోయల్‌ను మంత్రులు, ఎంపీల బృందం కలిసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి ఆ ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ మరో తీర్మానం చేయాలని తెరాస అధినాయకత్వం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను, వార్డు సభ్యులను కోరినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా సమాచారాన్ని పంపించినట్టు తెలుస్తోంది. ధాన్యం చేతికొచ్చే వేళ వరి కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని కేంద్రం మెడలు వంచైనా పంటను కొనుగోలు చేయిస్తామన్న భరోసాను రైతుల్లో నింపాలని కేసీఆర్ గులాబీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ, రైతు వేదికల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ సమావేశాలను నిర్వహించాలని కోరింది.
రైతు సంఘాలతో సమావేశాలు
ధాన్యం పోరును మరింత ఉధృతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లిd నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు అయినా… కాకపోయినా ఢిల్లిd వెళ్లి అక్కడే మకాం వేయాలని ఈలోపు జాతీయ స్థాయిలోని రైతు సంఘాల నేతలతో సమావేశమై ధాన్యం సేకరణ విషయంలో వారి మద్దతును కూడగట్టాలని కేసీఆర్ సంకల్పించారు. కలిసివచ్చే అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ధాన్యం సేకరణకు కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాలన్న నిర్ణయానికి తెరాస వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో రైతు సంఘాల నేతలతో సమావేశాలు, చర్చాగోష్టులను నిర్వహించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రౌండ్‌టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది.
గోయల్ క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా అవమానించారని దీనిపై ఆయన క్షమాపణ చెప్పేదాకా వదలవద్దని ఎంపీలను కోరారు. సోమవారం జరిగే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వాయిదా తీర్మానాన్నిచ్చి పీయూష్ గోయల్ వ్యాఖ్యలను ఉభయ సభల దృష్టికి తీసుకువెళ్లాలని, ఒకవేళ వాయిదా తీర్మానాన్ని అనుమతించని పక్షంలో ఆందోళన నిర్వహించి సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ధాన్యం సేకరణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేయాలని కోరారు.
పార్లమెంట్‌లోనూ పోరాటం
జాతీయ స్థాయిలో ఒకే సేకరణ విధానం ఉండాలన్న డిమాండ్‌ను లోక్‌సభ, రాజ్యసభ దృష్టికి తీసుకువెళ్లాలని పంజాబ్ విధానాన్నే అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. రాజకీయ కారణాలతో కేంద్రం తన ధర్మాన్ని విస్మరిస్తోందని ఇదే విషయాన్ని పార్లమెంట్ ఉభయ సభల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ వెళ్లే ముందు రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన ఆందోళనలు, ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానిని కలిసి వినతిపత్రం ఇచ్చాక ఆయన నుంచి వచ్చే స్పందన మేరకు ఢిల్లిdలో ధర్నా చేయాలా లేక ఇంకేమైనా ఆందోళన కార్యక్రమాలు రచించాలా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెరాస సీనియర్ నేత ఒకరు చెప్పారు.