పాకిస్తాన్ భూభాగంలోకి భారత క్షిపణి దూసుకెళ్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈ ఘటనపై మార్చి 9న లోక్‌సభ వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. మిస్సైల్ యూనిట్‌లో రోజూ లాగే తనిఖీలు చేస్తుండగా.. పొరపాటున మార్చి 9న రాత్రి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిందని రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ పార్లమెంట్ వేదికగా వివరణ ఇచ్చారు. అది తర్వాత పాక్ భూభాగంలో పడినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటన జరగడం విచారకమని చెప్పారు రాజ్‌నాథ్ సింగ్. ఘటన గురించి ప్రజలకు రక్షణ మంత్రి ప్రకటన ప్రజలకు వెల్లడించింది శూన్యమని, ఇది వివరణ ఇచ్చుకోవాల్సిన భయానక ఘటనని ఓవైసీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు, సినిమాలకు ప్రచారార్భాటం కల్పించడం మానుకుని మిసైల్ ఘటనపై పారదర్శకంగా, నిజాయితీగా దృష్టిసారించాలని ఓవైసీ స్పష్టం చేశారు. బాధ్యతాయుత అణ్వస్త్ర శక్తిగా భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, ఈ అసమర్ధ ప్రభుత్వం కారణంగా ఆ ప్రతిష్టకు భంగం కలగరాదని ఆయన పేర్కొన్నారు. లాంఛర్‌లో మరికొన్ని మిసైల్స్ ఉన్నాయన్నది నిజమేనా.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఇలాంటి చర్యల పర్యవసానం ఏంటో మనం ఊహించగలమా అని ఓవైసీ ప్రశ్నించారు. మిస్సైల్ నిర్ధేశిత లక్ష్యమేంటని ప్రశ్నించిన ఓవైసీ మిసైల్ వార్‌హెడ్‌తో ఉందా? అని వరుస ట్వీట్లలో మోదీ సర్కార్‌ను నిలదీశారు. మరోవైపు పార్లమెంట్ వేదికగా మిస్సైల్ ఘటనపై రాజ్‌నాధ్ సింగ్ వివరణ అసంతృప్తిగా, అరకొరగా ఉందని పాకిస్తాన్ ఆక్షేపించింది. ఈ ఘటనపై సంయుక్త విచారణ చేపట్టాలని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి డిమాండ్ చేశారు.