జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మాల్వా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టాప్ కమాండర్‌తో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో టాప్ 10 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న లష్కరేటర్ కమాండర్ యూసుఫ్ కాంత్రూ మట్టుబెట్టారు.
బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు భద్రతా దళాలకు సమాచారం అందిడంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఆర్మీతో పాటు బుద్గామ్ పోలీసుల ప్రత్యేక బృందం మాల్వా ప్రాంతంలో జాయింట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు.