కాంగ్రెస్ పార్టీ టికెట్‌లపై గెలుపొందిన తరువాత.. ఇతర పార్టీలోకి వెళ్లబోమని.. ఆ పార్టీ సీనియర్ నేతలు అభ్యర్థులతో శనివారం ప్రతిజ్ఞ చేయించారు. మొత్తం 36 మందితో వివిధ ప్రార్థనా మందిరాల్లో ఈ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల వ్యూహకర్త పి.చిదంబరం, గోవా ఇన్‌చార్జి దినేష్ గుండు రావు, ప్రతిపక్ష నేత దిగంబర్ కామత్, గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడన్‌కర్‌తో పాటు పలువురు ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రజల ఓట్లు పొంది.. ఇతర పార్టీలోకి జంప్ అయితే.. తీవ్రంగా పరిగణిస్తామని దిగంబర్ కామత్ హెచ్చరించారు.
మహాలక్ష్మీ ఆలయం, బోంబ్లిమ్ క్రాస్‌తో పాటు హజ్రత్ మహ్మద్ హంజా షా దర్గాల్లో 36 మందితో ప్రతిజ్ఞ చేయించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఆఫర్లు కూడా ఇస్తుందని, గోవా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు. గతంలో పార్టీ ఫిరాయించినట్టు.. ఈసారి రిపీట్ చేయవద్దన్నారు. ఎంతో నమ్మకంతో టికెట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. 2017లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే.. ఐదేళ్ల కాలంలో 15 మంది బీజేపీలోకి చేరిపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే కాంగ్రెస్‌లో ఉండిపోయారు.