లెస్సర్ ఫ్లోరికాన్ (lesser florican) పక్షులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పక్షులు రాజస్థాన్ నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా దాకా ఎక్కడా ఆగకుండా ఎగిరి వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. దేశంలో ఈ పక్షులు వలస వెళ్లే (migration) దూరంలో ఇదే అత్యధికమని గుర్తించారు.
లెస్సర్ ఫ్లోరికాన్లు భారత ఉపఖండంలో మాత్రమే కనబడతాయి. ఎక్కువ ఎత్తున్న గడ్డి భూములను ఇష్టపడతాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పక్షులు ఐయూసీఎన్ ఎండేంజర్డ్ లిస్టులో ఉన్నాయి. సైట్స్‌లో అపెండిక్స్ 2 లిస్టులో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972లో షెడ్యూల్ 1లో ఉన్నాయి. పక్షులను వేటాడటం, పక్షుల నివాస ప్రాంతాలు తగ్గిపోతుండటంతో లెస్సర్ ఫ్లోరికాన్లు ప్రమాదంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.