హైదరాబాద్, ఆంధ్రప్రభ: పర్యా టక లీజుభూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఉమ్మడి పాలనలో హైద రాబాద్ లోని చారిత్ర ప్రాధాన్యత గల అనేక భూములను పర్యాటక రంగాభి వృద్ధికి లీజుకు ఇచ్చింది. అయితే సంవత్స రాలు గడిచిన లీజుభూముల్లో నిబంధనల మేరకు అభివృద్ధి జరగక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో అనేక సంస్థలు భూములు లీజుకు తీసుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు విస్మరించి ఇతర ప్రయోజనాలకోసం ఆభూములను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పక్కా సమాచారం సేకరించింది. సమైక్యపాలకులు లీజు భూముల వ్యవహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వందలాది ఎకరాలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాయి. ఆభూముల వివరాలను తెలంగాణ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను రూపొందిస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది.
పర్యాటకభూములను లీజుకు తీసుకుని అభివృద్ధి చేయకుండా, నిబంధనలు పాటించకుండా ఇతర అవసరాలకు భూములను వినియోగిస్తున్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతో పాటుగా ఆభూములను స్వాధీనం చేసుకుంటోంది. ప్రధానంగా పర్యాటక శాఖకు చెందిన సుమారు రూ.1000 కోట్ల విలువైన 2 స్థలాలను రాష్ట్ర పర్యాటక శాఖ స్వాధీనం చేసుకుంది. మిగతా లీజుభూమిలపై నిబంధనలకు లోబడి కేసులు నమోదు చేసింది.
శామీర్ పేటలోని జవహర్ నగర్ లోని సర్వే నంబర్ 12లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి పేరుతో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజం శాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకుంది. 2004లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లీజు నిబంధనలు సడలించి పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో అనేక సంస్థలకు వందలాది ఎకరాల భూములను
లీజుకు ఇచ్చారు. అందులో భాగంగానే ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ కు పర్యాటక రంగాభివృద్ధికి 130 ఎకరాల భూమి లీజుకు తీసుకుంది, అయితే నింబంధనలు పాటించకుండా ఇతర అవసరాలకు భూమిని వినియోగిస్తున్నట్లు పర్యాటక శాఖ క్షేత్ర స్థాయి సర్వేలో తేలింది. ఈ భూమిని రాష్ట్ర పర్యాటక శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ సంస్థపై కేసునమోదు చేసి నష్టపరిహారాన్నిప్రభుత్వం నష్ట పరిహారాన్ని కోరింది.
సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ పక్కన ఉన్న 4600 గజాల విలువైన భూమిని ఈ సిటీ జాయింట్ స్క్రీన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పర్యాటక రంగాభివృద్ధి కోసం హోటల్స్ నిర్మాణంతో పాటుగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు లీజుకు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని సంస్థపై కేసునమోదు చేసింది. అలాగే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధిపేరుతో లీజుకుతీసుకున్న సుమారు 50 స్థలాలు ఉన్నట్లు పర్యాటకశాఖ పరిశీలనలో ఉంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
2004లో పర్యాటక రంగాభివృద్ధికి లీజుకు తీసుకున్న భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికలను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికార యంత్రాంగంతో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రూ. 1000కోట్ల విలువైన భూములను పర్యాటక శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ డీపీఆర్ లను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రామప్ప దేవాలయం లాంటి అరుదైన కట్టడాలు అనేకం ఉన్నాయి. ఆప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాల నిర్వహణకు పర్యాటక శాఖ డీపీఆర్ లను రూపొందిస్తోంది.
లీజు నిబంధనలు పాటించని సంస్థలపై కేసులు
పర్యాటరంగాభివృద్ధి కోసం లీజుకు తీసుకుని ఎలాంటి ప్రాజెక్టులు స్థాపించని సంస్థలపై నిబంధనలమేరకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, ఎక్సైజ్, శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎండి. మనోహర్ రావు, ఓఎస్డీ సత్యనారాయణ,లీగల్ ఆఫీసర్ అదిల్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమై లీజు భూముల స్వాధీనంపై సుధీర్ఘంగా చర్చించారు. సంవత్సరాల తరబడి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని లీజుభూములపై నివేదికలను రూపొందిస్తున్నారు. త్వరలో మరిన్ని భూములను స్వాధీనం చేసుకోనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.