నేటి రాజకీయాలు బాగా దెబ్బతిన్నాయని, కులాలు, తిట్లు, ఆరోపణలు పెచ్చుమీరాయన్నారు సీపీఐ నేత కె. నారాయణ. ఒకప్పుడు రాజకీయాలంటే సిద్ధాంతాలు, వైరుధ్యాల వరకే పరిమితమయ్యేదని, ఇక.. లీడర్లంతా కలిసిమెలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి వచ్చిందని, శత్రువులుగా మారిపోయారన్నారు. ఇక ఏపీలో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అయిన తర్వాత చంద్రబాబు, నారాయణల కులం ఒకటే అనే పరిస్థితి వచ్చిందని, కులంతో తమ రాజకీయాలకు సంబంధమే లేదన్నారు. అయితే తాను పార్టీ పరంగా బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తాను కానీ, బీజేపీ లీడర్లలో దత్తాత్రేయ అంటే చాలా గౌరవం, మర్యాద ఉంటాయన్నారు. తనతో ఎప్పుడు కలిసినా స్నేహపూర్వకంగా మాట్లుకునే పరిస్థితి ఉంటుందని, మిగతా లీడర్లలో ఆ పరిస్థితులను చూడలేదన్నారు.
రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లో చూపించేలా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలకు అంత మంచిది కాదని, భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇట్లాగే చేయడం వల్ల భవిష్యత్ తరాలకు మనం ఏం అందించబోతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని సహృద్భావంగా రాజకీయాలు చేయాలని సూచించారు.