Tuesday, November 26, 2024

తెలంగాణలో మందుల కొరత లేదు.. హెల్త్ ప్రొఫైల్ పై మంత్రి హరీష్ కీలక ప్రకటన

తెలంగాణలో మందుల కొరత లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిర్మల్ జిల్లాలో రూ. 40 కోట్లతో నిర్మించే నూతన జిల్లా అసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…280 పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోరిక మేరకు సీఎం ఇక్కడ మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు మొదటి మెట్టు ఈ ఆసుపత్రి ప్రారంభం అని పేర్కొన్నారు. ఏఎన్ఎం, ఆశాలు కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. రాష్ట్ర హైకోర్టు సైతం కరోనా మూడో వేవ్ లో తెలంగాణ పనితీరును మెచ్చుకుందని గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశల జీతాలు తక్కువగా ఉండేవన్న మంత్రి హరీష్.. పెంచాలని రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసేవారి గుర్తు చేశారు. నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని మండిపడ్డారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జీతాలు పెంచారన్నారు. 2014 ముందు రు. 1500 ఉంటే.. 6000 వేలకు పెంచారు. అడగకుండానే మళ్ళీ 30 శాతం పెంచి ఇప్పుడు  రు. 9750 ఇస్తున్నామన్నారు.  మరింత బాగా పని చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని 27 వేల మందికి స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చామన్నారు. ఒకపుడు ఆశాలు అంటే చిన్నచూపు.. ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. డెలివరీ విషయంలో ఆశాలు మరింత దృష్టి సారించాలన్నారు. గర్భం దాల్చిన తర్వాత రెగ్యులర్ గా చెకప్స్ చేయించాలని సూచించారు. ఎనీమియా బారి నుండి గర్భిణులను కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని, సాధారణ డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలని మంత్రి హరీష్ చెప్పారు. ఆశాలు ఈ విషయంలో కృషి చేయాలన్నారు. పుట్టిన బిడ్డకి అప్పుడే గోల్డెన్ అవర్ లో తల్లి పాలు అందుతాయని పేర్కొన్నారు.

తెలంగాణలో బిపి, షుగర్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి హరీష్.. ప్రాథమికంగా గుర్తించి మందులు ఇచ్చినా కొందరు అవగాహన లేక వేసుకోవడం లేదన్నారు. ఇలాంటి వారి కోసం హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించుకోబోతున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 5న ములుగు, సిరిసిల్లలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంగన్ వాడీలను కూడా ప్రభుత్వం బాగా చూసుకుంటున్నది. 2014 లో 4200 ఉన్న జీతాన్ని పెంచింది. ఇప్పుడు 13,650 అందుకుంటున్నారు. దేశం లోనే మనది అత్యధికం. తెలంగాణలో మందుల కొరత ఉండదు.కొరత ఉందంటే డాక్టర్ పై చర్యలు ఉంటాయి. మెడికల్ బడ్జెట్ పెంచాము. పేదలకు వైద్యం భారం కాకుండా.. చూస్తున్నది. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నవి 3 మెడికల్ కాలేజీలు మాత్రమే. మాత్రమే.  తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నము. ఆశాలు అంగన్ వాడీలు ఎ ఎన్ ఏం లు మీరు ఎంతో ముఖ్యం.. 80 శాతం సాధారణ డెలివరీలు అయ్యేలా కృషి చేద్దాం. ఆరోగ్య రంగంలో మనం మొదటి స్థానానికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది ఉన్నా చూసుకుంటా.. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేసేలా కృషి చేస్తా.. మీరు ప్రజలకు నాణ్యమైన సేవలు చేయండి. ఒకప్పుడు నేనురాను బిడ్డో సర్కారు దావాఖాన అనే మాట ఉండే.. ఇప్పుడు నేను సర్కారు దవాఖానకే పోతా అనేలా అభివృద్ధి చేసాము. రాబోయే రోజుల్లో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement