Saturday, November 23, 2024

Big Story: తులతూగిన నేనే.. తూలిపోయా, సోలిపోయా.. లతాజీ పలుకుల్లో ఒలికిన జీవితసారం..

లతా మంగేష్కర్‌ ప్రపంచంలోనే గొప్ప గాయినిగా పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక జెట్‌ విమానాల్లో ప్రయాణాలు చేశారామె. గొప్ప గొప్ప పాలకులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు. భారత ప్రభుత్వం అత్యంత విలువైన భారతరత్నతో ఆమెను గౌరవించింది. ప్రపంచం లోనే మరే ఇతర గాయకులకు లేదా గాయనికి దక్కని అరుదైన అవకాశాలు, సన్మానాలు ఆమె సొంతమయ్యాయి. ఆమె పాట కోసం దేశాల రాజులు, అధ్యక్షులు ఆతృతగా ఎదురుచూసేవారు. ఆమె గానం కోసం ఆలయా ల్లోని భగవంతుని ప్రతిమలు ఆరాటపడేవి. అలాంటి మంగేష్కర్‌ తన 92వ ఏట ముంబయ్‌లోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి మృత్యువు చేతుల్లో ఓడిపోయారు. ఈ నెల రోజులు ఆమె తన తాత్విక చింతనను, వైరాగ్యాన్ని సన్నిహితుల్తో పంచుకు న్నారు. ఆసక్తి కలిగిన కొందరు సన్నిహితులిప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తె స్తున్నారు. లత వ్యాఖ్య లు, ఆలోచనలు, తాత్విక చింతనలు ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ ఆలోచనకు గురి చేస్తున్నాయి.
‌- న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి

కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా సంపద పెంచుకుని అపర కుబేరులుగా అవతరించాలన్న ఆలోచనలు పెరిగా యి. ఒకర్ని మించి మరొకరు గొప్ప సంపన్నులుగా మారేం దుకు పోటీలుపడుతున్నారు. ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్న సంపన్నులు వచ్చే ఏడాదికి మొదటి స్థానం దక్కించుకు తీరాలని గట్టిగా నిర్ణయించుకుని అందుకనుగుణంగా సంపద పెంపుపై దృష్టి సారిస్తున్నారు. గతంలో ప్రపంచ స్థాయిలో పారిశ్రామిక వాణిజ్య వేత్తలుగా ఆధ్యాత్మిక పరులుగా గుర్తింపు పొందేందుకు తపనపడే వారు. కానీ ఇప్పుడు ఏరూపం లోనైనా సరే సంపన్నులుగా మారి అపర కుబేరులుగా ప్రపంచం చేత ప్రశంసలు పొందాలన్న ఆరాటం పెరిగింది. కొందరు ప్రపంచ స్థాయి సంపన్నులుగా మరికొందరు ఆయా దేశాల్లో కుబేరులుగా, ఇంకొందరు రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల్లో తామే అతిగొప్ప ఆస్తిపరులుగా గుర్తింపు పొందేందుకు పోటీలు పడుతున్నారు. వీరెవరూ చివరి దశలో ఈ సంపద వారి జీవితకాలాన్ని కనీసం ఒక్క సెకను కూడా పెంచలేదన్న వాస్తవాన్ని గుర్తించలేక పోతున్నారు. సేవా భావం, తాత్విక చింతనలను అలవర్చుకోలేక పోతున్నారు. ఇలాంటి వారందరికీ లతామంగేష్కర్‌ చివరిదశ లో వెలువరించిన అభిప్రాయాలు కనువిప్పు కలిగించాలి.

దేశంలోని లక్షలాదిమంది మేథావు లు, నిపుణులు, నిష్ణాతులు, విద్యార్ధులు కూడా విదేశాలకెళ్ళడం ద్వారా ఎక్కువ సంపదను కూడబెట్టాలని, మెరుగైన జీవన ప్రమాణాల్ని పొందాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం విదేశాల వెంట పరుగులుదీస్తున్నారు. కోవిడ్‌ నేపధ్యంలో కూడా విదేశాల్లో స్థిరనివాసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలో భారతీయులే మొదటి స్థానంలో ఉన్నారు. అమెరికా, కెనడా, పోర్చుగల్‌, ఆస్ట్రియా, టర్కీ, యుకె, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు వీరంతా ఎగిరెళ్ళిపోతున్నారు. అలాగే సంపన్నులు కూడా విదేశాల్లో వ్యాపారాలెట్టుకుని మరింతగా ఆర్దిక సంపదను పోగే సేందుకు పోటీలు పడుతున్నారు. దుబాయ్‌, హాంకాంగ్‌, సింగపూర్‌లకు దూసుకుపోతున్నారు. ఎక్కడికెళ్ళి ఎంతగా సంపద పోగేసినా చివరకు మరణం తప్పదన్న విషయాన్ని వీరెవరూ గుర్తించడంలేదు. కొన్ని తరాలకు సరిపడా ఆస్తిని పోగేసి వారసులకు అందివ్వాలన్న ఆతృత మధ్య సామాజిక భావానికి దూరమౌతున్నారు.

”ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఐదునక్షత్రాల హోటల్స్‌లో బస చేశాను. అలాంటిదిప్పుడు ఆసుపత్రిలో వైద్యులు సూచించిన పరీక్షల కోసం గది గదికి మారుతున్నాను. నా శిరోజాల్ని అలంకరించేందుకు ప్రత్యేకంగా కొంతమంది నిపుణులుండేవారు. కానీ ఇప్పుడు దువ్వుకునేందుకు తలపై శిరోజాలే లేవు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న హోటల్స్‌లోని ఆహారాన్ని రుచిచూసిన నాకిప్పుడు పగటిపూట రెండు, రాత్రి పూట ఒక మాత్రతోనే కడుపు నింపు కోవాల్సొస్తోంది. జెట్‌ విమానాల్లో ప్రపంచం మొత్తం తిరిగిన నాకిప్పుడు ఆసుపత్రి వరండాలోకెళ్ళేందుక్కూడా ఇద్దరు అటెండర్లు సాయం అవసర మౌతోంది. గొప్ప గొప్ప వసతులు, పరికరాలు, డబ్బు ఇవేవీ నాకు ఎలాంటి ఓదార్పునివ్వడంలేదు. నా శారీరక బాధనుంచి ఉపశమనం కల్పించడంలేదు. ఇదే యదార్ధం.. ఇదే శాశ్వతం.. ఇవేవీ చేయలేని పనిని కొందరు ఆత్మీయుల ప్రార్ధనలు చేస్తున్నాయి. నాకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. ధనం, పదవి కంటే మంచి మనసున్న వారి స్నేహం, ఆప్యాయతలే అత్యంత విలువైనవి” అంటూ లంతా మంగేష్కర్‌ తమ వద్ద వ్యాఖ్యానించినట్లు సన్నిహితులు పెడుతున్న పోస్టులిప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నా యి. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. జీవిత వాస్తవ దృక్పధాన్ని బోధిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement