మహిళలకు డబ్బులిస్తే కచ్చితంగా తిరిగి చెల్లిస్తారని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లెక్క మోసం చేయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు లక్షలకు లక్షలు ఎగ్గొట్టరని, బ్యాంకులను ముంచరని అన్నారు. సెర్ప్ వార్షిక ప్రణాళిక కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. లక్షల కోట్లు ఎగ్గొట్టి, బ్యాంకులను ముంచరని అందుకే మహిళా సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వొచ్చని బ్యాంకర్లకు మంత్రి సూచించారు.
వాళ్లు చెల్లించ గలిగినంత చూసి వీలైనంత ఎక్కువ రుణాలు ఇవ్వాలని, దీంతో బ్యాంకులు కూడా బాగుపడతాయని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా కూడా మేము ఐకేపీ, స్త్రీ నిధి ద్వారా మహిళలకు కోట్లాది రూపాయలు రుణాలిస్తున్నామని వందకు వంద శాతం తిరిగి చెల్లిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మహిళల్లో పట్టుదల, ఆత్మాభిమానం ఎక్కువ అని, ముఖ్యంగా కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలని వారిని కోరారు. మహిళలు ఎదిగితే, రాష్ట్రాలు, దేశం బాగుపడతాయన్నారు.