Tuesday, November 19, 2024

Big Breaking: మోయినాబాద్​ ఫాంహౌస్​లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం.. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను వలలో వేసుకునేందుకు బీజేపీ చేస్తున్న కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్​ ఫాంహౌస్​లో ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపినట్టు వెల్లడయ్యింది. ఈక్రమంలో పోలీసులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలొ నగదు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి సన్నిహితుడు అయిన డెక్కన్​ హోటల్​ ప్రైడ్​ నిర్వాహకుడు. అంబర్​పేటకు చెందిన నందు మీడియేటర్​గా పైలట్​ రోహిత్​రెడ్డికి చెందిన ఫాం హౌస్​లో మంతనాలు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఇదంతా తెలంగాణలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్రకు తెరతీశారని, తమ ఎమ్మేల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి చూశారని టీఆర్​ఎస్​ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, వారి ఆరోపణలు నిజం చేసేలా మోయినాబాద్​లోని బీజేపీ అగ్ర నేత సన్నిహితుల ఫాం హౌస్​లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం వారి ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్లా అయినా గెలవాలన్న దుర్బిద్ధితో బీజేపీ కుటిల యత్నాలు పన్నుతోందని టీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. కాగా, పోలీసులు దాదాపు 15 కోట్లకు పైగా నగదు గుట్టలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొంతమంది అయితే 100 కోట్లు దొరికాయని అంటున్నారు. కాగా, ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్​ సతీశ్​శర్మ అనే స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. స్వామీజీతోపాటు తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్​కు చెందిన నందు అనే మీడియేటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. స్వామీజీని తెలంగాణకు ఎవరు పంపించారు. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఈ మంతనాలు జరపమని చెప్పింది ఎవరు? అనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక.. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్​రెడ్డి, పైలట్​ రోహిత్​రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభ పెట్టి తలా 100 కోట్ల రూపాయలను అప్పజెప్పి పార్టీ ఫిరాయించేలా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్​గా ఫోకస్​ పెట్టింది. ఈ దుర్మార్గపు చర్యపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలుంటాయని టీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు.

కాగా, ఎమ్మెల్యేలతో బేరసారాల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర అన్నారు. మరికాసేట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. అయితే.. నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు ఈ రైడ్​ చేసి మీడియేటర్లను, భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement