బలగాల ఉపసంహరణ మాటున రష్యా దారుణాలకు పాల్పడుతోందని, శవాల మాటున ల్యాండ్ మైన్లు పెట్టి వెళ్లిపోతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఇటీవలే శాంతి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా రష్యా తన బలగాలను కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. చెప్పినట్టుగానే బలగాల ఉపసంహరణను రష్యా ఇప్పటికే మొదలుపెట్టింది కూడా. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రష్యాపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ దాడుల్లో చనిపోయిన ఉక్రెయిన్ పౌరుల శవాల కింద ల్యాండ్ మైన్లను రష్యా సైనికులు పెట్టి వెళ్లిపోతున్నారని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. దాడుల్లో శిథిలమైన ఇళ్లల్లోనూ రష్యా సైనికులు ల్యాండ్ మైన్లను ఉంచి వెళుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వచ్చే విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు. సైన్యం ప్రకటన చేసే దాకా ప్రజలు వేచి చూడాలని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement