Friday, November 22, 2024

కబ్జా కోరల్లో చెరువు శిఖాలు… తాత్కాలిక నిర్మాణాలు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రసూల్ కుంట చెరువు,రాళ్ళకుంట చెరువు శిఖాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ అధికారుల అలసత్వంతో శిఖం భూముల్లో తాత్కాలిక ఆవాసాలు వెలుస్తున్నాయని చెరువు శిఖం ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగుజిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘణపురం ఐటీడీఏ ఎదురుగా ఉన్న రసూల్ కుంట చెరువు శిఖంలో గత నలభై ఏళ్ల క్రితం చిన్న చిన్న ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు. గత పదిహేనేళ్ల నుండి మండల కేంద్రంలో ఇంటి స్థలాలకు ధరలు పెరగడంతో,ఆ తాత్కాలిక ఆవాసాలు పటిష్ట నిర్మాణాలుగా చేసుకుంటున్న క్రమంలో చెరువు కబ్జాకు గురవుతోందని పలువురు పిర్యాదులు ఇవ్వడంతో తూ తూ మంత్రంగా ఆవాసాల నిర్మాణ పనులు నిలిపివేయడం, శాఖ పరమైన నోటీసులు ఇవ్వడంలాంటి పనులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.

అధికారులు ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేస్తూ కబ్జా దారులు శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు. ప్రస్తుతం రసూల్ కుంట చెరువు చుట్టూ చాల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. దీంతో వారిని ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.రసూల్ కుంట చెరువు పరిస్థితి ఇలా ఉంటే……వెనుక రోడ్డులో ఉన్న రాళ్ళకుంట చెరువు శిఖంపై సైతం కబ్జాదారుల కన్నుపడింది. కొందరు ట్రాక్టర్లతో మట్టినిపోసి కబ్జా చేస్తుంటే, మరికొందరు ట్తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేసుకుని కబ్జాకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఏమి తెలియనట్లు వ్యవహరించడంపై శిఖం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు చెరువు శిఖం సరిహద్దుల చుట్టూ ఫెన్షింగ్ వేసి స్వాధీన పరచుకోకపోతే,ఈ చెరువు కూడా రోడ్డు పక్కనే ఉండడంతో కబ్జాకు గురవుతోందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు దృష్టిపెట్టి,అక్రమ నిర్మాణాలను తొలగించి,కబ్జాను ఆదిలోనే అంతమొందించి,చెరువును కాపాడాలని రైతులు కోరుతున్నారు. చెరువు శిఖాలు పూర్తిగా కబ్జాకు గురైన తర్వాత నోటీసులు, హెచ్చరిక బోర్డులు పెడితే లాభం ఉండదని మండల ప్రజలు, ఆయకట్టు రైతులు అధికారులకు సూచిస్తున్నారు.ఇప్పటికైనా రెవెన్యూ శాఖ తక్షణమే చర్యలు చేపట్టి, వందల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చెరువు శిఖాన్ని కబ్జా దారుల కోరలనుండి కాపాడాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement