Saturday, November 23, 2024

Horticulture: ఉద్యానవ‌న శాఖలో అధికారుల కొరత.. ఏడు మండ‌లాల‌కు ఒక్క‌రే బాధ్యులు

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : పెరుగుతున్న జనాభాకు సరిపడే విధంగా కూరగాయల ఉత్పత్తి పెరగడం లేదు. శివారు ప్రాంతాల్లో వ్యవసాయం చాలావరకు తగ్గిపోయింది. వ్యవసాయ భూములు కాస్త వెంఛర్లుగా మారిపోయాయి. ఇప్పటికే సాగు చేస్తున్న ప్రాంతాల్లో రైతులను మరింతగా ప్రోత్సయించి సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం పెరగాలంటే రైతులకు సరియైన విధంగా సూచనలు, సలహాలు అందించాల్సి ఉంటుంది. కానీ ఉద్యానవన శాఖలో అధికారుల కొరత కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. చాలాకాలం నుండి సంబంధిత ఉద్యానవన శాఖ అధికారుల నియామకం లేకపోవడంతో రైతులకు సరియైన విధంగా సూచనలు సలహాలు అందడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒకొక్కరికి ఏడు మండలాలనుండి ఎనమిది మండలాలు కేటాయించారు. వాస్తవానికి సంబంధిత అధికారి వారంలో ఒక రోజు మాత్రమే మండలానికి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ రోజు మండల సర్వసభ్య సమావేశం ఉంటే హాజరై తిరిగి వచ్చేస్తున్నారు. వారంలో ఒకరోజు మండలానికి వెళ్లినా రైతులను కలిసేది తక్కువే. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలంటే రైతులకు సరియైన అవగాహన, సూచనలు అందించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వారి పొలాలకు వెళ్లి సరియైన విధంగా సూచనలు అందించాల్సి ఉంటుంది. ఏడు మండలాలకు ఒక అధికారి ఉండటంతో సేవలు ఎలా అందిస్తారనేది ఆలోచించాల్సిన విషయం. వాస్తవానికి మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారులు ఉండాల్సి ఉంది. కానీ జిల్లాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండటంతో వాళ్లు సరియైన విధంగా సేవలు అందించలేకపోతున్నారు. మండలానికి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యానవన శాఖ అధికారుల సేవలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో రైతులు తమకు తామే నిర్ణయం తీసుకుని సాగు చేసుకుంటున్నారు.

ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై వారికి వారే నిర్ణయం తీసుకుని సాగు చేసుకుంటున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు కూడా. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందనే దానిపై సరియైన విధంగా అవగాహన లేదు. ఒకే రకమైన పంటలు ఎక్కువమంది సాగు చేస్తుండటంతో ఆశించినమేర ధర కూడా పొందలేకపోతున్నారు. శాఖలో సగానికి పైగా పోస్టులు కాళీగానే ఉన్నాయి. జిల్లాలో 38 పోస్టులకు ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే పని చేస్తున్నారు. ఏకంగా 29 మందిని భర్తీ చేయాల్సి ఉంది. వాస్తవానికి మండలానికో అధికారి ఉంటే రైతులకు సరియైన విధంగా సలహాలు అందుతాయి. కానీ ఇప్పట్లో మండలానికో అధికారిని నియమించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.

రెండు సీజన్‌లో 30వేల ఎకరాలకు పైగానే సాగు..
జిల్లాలో కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తారు. రెండు సీజన్లలో కూరగాయలు సాగు చేస్తున్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం 30వేల ఎకరాలకు పైగానే సాగు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో వానాకాలంలో 14వేల ఎకరాలకు పైగానే కూరగాయలు సాగు చేశారు. యాసంగిలో 19వేలకు పైగా అన్ని రకాల కూరగాయలు సాగు చేశారు. జిల్లాలో రెండు సీజన్లలో కలిపి 33వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. సాగు చేసిన కూరగాయల ద్వారా 3లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని సాధించారు. గతసారి గిట్టుబాటు ధర కూడా లభించడంతో రైతులకు ఆర్థిక వెసులుబాటు కలిగింది.

కూరగాయల జోన్‌ అటకెక్కినట్లేనా…
ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయల జోన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రులు వారడంతో జోన్‌ ఏర్పాటు చేయలేకపోయారు. కూరగాయల జోన్‌ ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని భావించారు. ఆ దిశగా కొంతమేర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ తరువాత సరియైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో కూరగాయల జోన్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దీని ఊసే లేకుండాపోయింది. గతంలో కూరగాయల సాగుకు ప్రోత్సహించేందుకు రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలు సరఫరా చేసేవాళ్లు. గత రెండేళ్లుగా ఈ ఊసే లేకుండాపోయింది. రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పించి కూరగాయల సాగును పెంచేలా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది.

- Advertisement -

కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. హైదరాబాద్‌కు చుట్టూరా రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. ఇక్కడినుండి అధిక విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తే హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కొరత లేకుండా సరఫరా చేసే అవకాశం ఉంది. రానురాను హైదరాబాద్‌ చుట్టూరా ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. అందరికీ సరిపడే విధంగా మార్కెట్లలో కూరగాయలు అందుబాటులో ఉంచాలి. పెరుగుతున్న జనాభాకు సరిపడే విధంగా కూరగాయల ఉత్పత్తి పెరగడం లేదు ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. సాగు పెరగాలంటే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలతోపాటు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకరావల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలేమి జరగడం లేదు. భవిష్యత్తులో కూరగాయల కొరత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. దీనిని ముందుగానే గుర్తించి హైదరాబాద్‌కు చుట్టూరా ఉన్న జిల్లాల పరిధిలో కూరగాయల సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయని పక్షంలో కూరగాయల ధరలు కొండెక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement