Saturday, November 23, 2024

అరుదైన రికార్డు సృష్టించిన రమణ!

స్థానిక సంస్థల కరీంనగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత ఎల్.రమణ అరుదైన రికార్డు సృష్టించారు. శాసన సభ,  లోకసభతోపాటు శాసనమండలికి ఎన్నికై మూడు సభలకు ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో జగిత్యాల ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన రమణ, కరీంనగర్ ఎంపీ గెలుపొంది లోకసభలో అడుగు పెట్టారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్ర‌సాద్ రావుకు 584 ఓట్లు రాగా, ఎల్ ర‌మ‌ణ‌కు 479 ఓట్లు వ‌చ్చాయి. మొత్తం 1320 ఓట్లు పోల్ కాగా, 1303 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 17 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం చేసుకుంది. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా, మ‌రో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థులు భానుప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుంచి వంటేరు యాద‌వ‌రెడ్డి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుంచి తాతా మ‌ధు, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా నుంచి ఎం కోటిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠ‌ల్ గెలుపొందారు.

ఇక, ఉమ్మ‌డి నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement