తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇక జులై 16న ఎల్ రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో లాంఛనంగా టీఆర్‌ఎస్‌లో చేరుతారు. ఆ రోజు తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి రమణ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణభవన్ లేదా కరీంనగర్ వేదిక అయ్యే అవకాశం ఉంది.
ఇటీవలే ఎల్.రమణ మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇక రమణకు రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్యేల కోటా, ఒక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని రమణకు ఇచ్చి మండలికి పంపుతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఉత్తమ్ డైరెక్షన్ కౌశిక్.. పీసీసీలో ఏం జరుగుతోంది?